News

ధ్యేయ నిష్ఠతో పాటు ఆత్మీయ సంబంధాలూ సంఘ్ కార్యానికి ఆధారం

5views

చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న కారణాలతోనే మనుష్యులు ఒకరికొకరు విడిపోయి, దూరంగా వుండిపోతున్నారు. ఇదీ ప్రస్తుత సమాజ పరిస్థితి. వివిధ స్థాయిలలో జరిగే ఎన్నికలు కూడా మన:స్పర్ధలకు కారణం అవుతున్నవి. రాజకీయ క్షేత్రంలో పనిచేసే వారికి మనస్సులో అనేక రకాల ఆకాంక్షలు ఉబికివస్తాయి. అహంకారం పెరుగుతుంది. వీటిలో నుంచి ఘర్షణలు ఆరంభం అవుతాయి. ఇలాంటి సమస్యలు సంఘ కార్యకర్తల ముందుకూ వస్తాయి. తగిన దారిని వెతికిపట్టుకొని, వారిని ఆ ఘర్షణల నుంచి బయటపడవేయాల్సి వుంటుంది.

ఈ సమస్యలకు ఈనాడు పరిష్కారాలు లభిస్తూ వుండొచ్చు. అయితే రానూ రానూ ఇలాగే పరిష్కారం అవుతాయని చెప్పలేం. ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ అనుశాసనంతో పెరిగినవాడు కావడంతో, తాను పెరిగిన వాతావరణంలో తన గురించి, స్వీయ ప్రయోజనాల గురించి ఆలోచించుకోవడం లేనందున ఇప్పటికి ఇది సాధ్యమవుతూ వుంది. స్వయంసేవకులలో మనం పట్టుదల వహించి ధ్యేయ నిష్ఠను అలవరచినంత వరకే భవిష్యత్తులో ఇది సాధ్యమౌతుంది. ఆలోచన ఉన్నట్లయితే సంస్థతోనూ అనుబంధాన్నీ బలపరిచేది అవుతుంది. ఏ వ్యక్తులు, ఏ కుటుంబాలు తగినంత కాలం కలిసిమెలసి వుంటారో, వారిలో ఆత్మీయత నిర్మాణం అవుతుంది.

ఏ వ్యక్తులు, ఏ కుటుంబాలు కలిసి మెలిసి వుంటారో వారిలో ఆత్మీయ భావం నిర్మాణం అవుతుంది. ఈ విధంగా మన సంఘటనా కార్యంలోకి వచ్చిన వ్యక్తులందరిలోనూ ఏకాత్మ భావాన్నీ, ప్రేమ భావాన్ని జనింపచేయాలి. సంవత్సరాల తరబడి సంబంధాలు నెలకొని వున్న వ్యక్తులు తమ అహంకారం కారణంగానో, మనస్పర్థల కారణంగానో సంస్థను విడిచిపెట్టి దూరంగా పోకూడదు. ఇంటింటా సత్సంబంధాలు కలిగి వుండటం డాక్టర్జీ స్వభావం. ధ్యేయం పట్ల మనస్సు లగ్నమై వుండటం మన కార్యానికి ఆధారం. అయితే మనలో మనం ఆత్మీయ సంబంధాలతో మెలగాలి. సంఘాన్ని, స్వయంసేవకులను విడిచి వుండటం ప్రాణాన్నీ కోల్పోవటమంత కష్టంగా తూచాలి. అంత దృఢంగా స్వయంసేవకులలో సంబంధాలు ఉత్పన్నమై వుండాలి. కార్య పద్తిలో ఈ అంశాలన్నీ భాగమై, తదనుగుణంగా పని జరుగుతున్నది కనుకే ఆర్ఎస్ఎస్ శాఖల సంఖ్య వేలలోనూ, స్వయంసేవకుల సంఖ్య లక్షల్లోకి పెరుగుతూ, సంఘ్ వర్ధిల్లుతోంది.