News

ఉత్తరాఖండ్‌లో మారనున్న ‘నికాహ్ నామా’: UCC పరిధిలోకి ముస్లిం వివాహాలు, కఠిన నిబంధనలకు రూపకల్పన!

15views

ఉత్తరాఖండ్‌లో అమల్లోకి వచ్చిన సమాన పౌర స్మృతి (UCC) చట్టానికి అనుగుణంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇస్లామిక్ వివాహ వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు మరియు చట్టపరమైన సమస్యలను నివారించేందుకు కఠినమైన నిబంధనలతో కూడిన నూతన ‘నికాహ్ నామా’ (వివాహ పత్రం) ముసాయిదాను సిద్ధం చేస్తోంది.

నూతన నిబంధనల ప్రకారం UCC చట్టం కింద బహుభార్యత్త్వం నేరం కావడంతో, కొత్త నికాహ్ నామా పత్రంలో రెండవ పెళ్లికి సంబంధించిన అనుమతులను పూర్తిగా తొలగించారు. దీంతో కాజీలు రెండవ నికాహ్ జరిపించడానికి వీల్లేదు. అలాగే మతం మారిన వెంటనే జరిపే నికాహ్‌లను బోర్డు అంగీకరించదు. మతం మారి వివాహం చేసుకోదలచిన వారు తప్పనిసరిగా ‘స్పెషల్ మ్యారేజ్ యాక్ట్’ కింద మాత్రమే పెళ్లి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

మరోవైపు వివాహాలు జరిపించే మౌలానాలు మరియు ఖాజీలను ఇకపై వక్ఫ్ బోర్డ్ గుర్తించి, వారికి ప్రత్యేక ‘యూనిక్ ఐడీ’ కేటాయించనుంది. పెళ్లి ప్రక్రియను పారదర్శకంగా ఉంచేందుకు వరుడు, వధువుతో పాటు సాక్షులు మరియు నికాహ్ జరిపించే మౌలానాల ఫోటోలు, సంతకాలు, ఆధార్ కార్డులు మరియు అఫిడవిట్‌ సమర్పించడం తప్పనిసరి చేశారు. ప్రతి వివాహ సమాచారం వక్ఫ్ బోర్డు రికార్డుల్లో భద్రపరచబడుతుంది.

ఈ నూతన ముసాయిదాను సెప్టెంబరు 9న UCC డ్రాఫ్ట్ కమిటీకి ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ షదాబ్ షామ్స్ సమర్పించనున్నారు. మహిళల సాధికారతకు , బాల్య వివాహాల అడ్డుకట్టకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని బోర్డ్ వర్గాలు వెల్లడించాయి.