
శ్రీ సత్యసాయి జిల్లాలో రైతులు అవలంభిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని జాంబియా దేశానికి చెందిన ఎనిమిది మంది సభ్యుల ప్రతినిధి బృందం ప్రశంసించింది. సుస్థిర వ్యవసాయ పద్ధతులను విస్తృత స్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన ప్రకృతి ఆధారిత విధానాలు, సంస్థాగత ఏర్పాట్లు, శాస్త్రీయ ఆధారాలు, విస్తరణ వ్యవస్థలు, ఆర్థిక సహాయ విధానాలు, భాగస్వామ్యాలపై అవగాహన కోసం ఈ బృందం జిల్లాలో పర్యటించింది.
బత్తలపల్లి మండలంలోని గంటాపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను జాంబియా ప్రతినిధులు సందర్శించారు. క్షేత్రస్థాయిలో ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానిక రైతులు అవలంభిస్తున్న వినూత్న పద్ధతులు, సుస్థిర వ్యవసాయ నమూనాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జాంబియా ప్రతినిధులు మాట్లాడుతూ.. జిల్లాలో అమలు చేస్తున్న సుస్థిర వ్యవసాయ పద్ధతులు తమను ఆకట్టుకున్నాయని తెలిపారు. ఇక్కడి సంస్థాగత ఏర్పాట్లు, శాస్త్రీయ ఆధారాలు, ఆర్థిక సహాయ విధానాలను అధ్యయనం చేసి.. వీటిని తమ దేశంలోనూ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
అంతకుముందు ప్రకృతి వ్యవసాయంలోని తొమ్మిది సార్వత్రిక సూత్రాలకు సంబంధించిన ప్రదర్శనలను ప్రతినిధి బృందం పరిశీలించింది. ఘనజీవామృతం, ద్రవజీవామృతం తయారీ విధానాలను ప్రత్యక్షంగా తెలుసుకుంది.
రైతు సాధికార సంస్థ చీఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ లక్ష్మానాయక్ ప్రకృతి వ్యవసాయంలో జీవ ఉత్ప్రేరకాల ప్రాధాన్యతను ప్రతినిధులకు వివరించారు. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పంటల పెరుగుదలకు జీవ ఉత్ప్రేరకాలు ఎలా ఉపయోగపడతాయో వివరించారు.
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల సందర్శనతో పాటు గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులతో జాంబియా ప్రతినిధులు పరస్పర చర్చలు నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయంలో మహిళల పాత్ర, వారి భాగస్వామ్యం, స్వయం సహాయక సంఘాల ద్వారా చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో ఏపీఎంఏఎస్ ప్రతినిధులు కలైమని, రమాదేవి సహకారం అందించారు. రైతు సాధికార సంస్థ అధికారులు సీనియర్ థిమాటిక్ సుధాకర్, టీఎల్ఎస్ సురేష్, స్వాతి, ఏపీసీఎన్ఎఫ్ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను అధ్యయనం చేసేందుకు జాంబియా ప్రతినిధుల పర్యటన జరగడం.. స్థానిక రైతులు అవలంభిస్తున్న సుస్థిర వ్యవసాయ పద్ధతులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నదానికి నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.





