News

14,140 అడుగుల ఎత్తున..వీర సైనికులకు ‘రాఖీ’ వందనం

0views

భారత్, చైనా సరిహద్దులో సిక్కిం వద్ద 14,140 అడుగుల ఎత్తున ఉన్న నాథు లా పాస్‌లో రక్షాబంధన్‌ వేడుకలు దేశభక్తి స్ఫూర్తిని చాటాయి. దేశంలోని ఆరు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 26 మంది యువతులు మన సరిహద్దులను కాపలా కాస్తున్న వీర సైనికులకు తిలకం దిద్ది, రాఖీలు కట్టారు. హేమంత్‌ యాదవ్‌ ఫౌండేషను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. శెరాథాంగ్, రానీపూల్‌ ప్రాంతాల్లోనూ ఈ వేడుకలు జరిగాయి. సిక్కిం యూనివర్సిటీ విద్యార్థినులు కూడా ఇందులో పాల్గొన్నారు.

ఫౌండేషను వ్యవస్థాపకుడైన డాక్టర్‌ హేమంత్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘రక్షాబంధన్‌ అనేది తోబుట్టువుల అనుబంధానికి మాత్రమే పరిమితం కాదు. ప్రేమ, నమ్మకం, బాధ్యత, రక్షణలతో కూడిన ఈ పండుగ జాతీయ సమైక్యతకు ప్రతీక. దేశంలోని 140 కోట్ల ప్రజలకు మేము ఇక్కడి నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాం’’ అన్నారు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో దేశమాత రక్షణకు కృషి చేస్తున్న సైనికులను కలుసుకోవడం గర్వకారణమని, ఈ వేడుక తమలో కృతజ్ఞతా భావాన్ని నింపిందని కార్యక్రమంలో పాల్గొన్న యువతులు తెలిపారు.