
విశాఖపట్నం: భారతీయ సంస్కృతి, హిందూ వివాహ సంప్రదాయాలపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఆస్ట్రేలియాకు చెందిన ఓ జంట విశాఖలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకుంది. స్నేహితుడి వివాహం జరుగుతున్న అదే వేదికపై, అదే సమయంలో తాము కూడా ఒక్కటై సన్నిహితులను ఆశ్చర్యపరిచింది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన రణసూర్య ఆస్ట్రేలియాలో జైళ్ల శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. అదే విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన బ్రాడీ కూడా పనిచేస్తుండటంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. బ్రాడీకి ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన ఎమిలీతో నిశ్చితార్థం జరిగింది.
ఈ నెల 28న విశాఖపట్నంలో రణసూర్యకు సృజనతో వివాహం జరగనున్న విషయం బ్రాడీ, ఎమిలీకి తెలిసింది. దీంతో భారతీయ వివాహ సంప్రదాయాలపై ఆసక్తి కనబరిచిన ఈ జంట.. తమ వివాహాన్ని కూడా అదే వేదికపై నిర్వహించుకోవాలని నిర్ణయించుకుంది.
కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా నుంచి భారత్కు చేరుకున్న బ్రాడీ, ఎమిలీ.. రణసూర్య, సృజనల వివాహ వేడుకలోనే హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హిందూ ఆచారాలు, సంప్రదాయాల మధ్య జరిగిన తమ వివాహం ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని కొత్త జంట ఆనందం వ్యక్తం చేసింది.
భారతీయ వివాహ వేడుకల్లో కనిపించే ఆధ్యాత్మికత, సంప్రదాయ పద్ధతులు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని వారు తెలిపారు. స్నేహితుడి పెళ్లి రోజునే తామూ అదే వేదికపై వివాహం చేసుకోవడం జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతిగా అభివర్ణించారు.
విదేశీ జంట హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవడం అక్కడికి వచ్చిన బంధువులు, స్నేహితులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.





