News

కార్మికుల హక్కులు కోసం భారతీయ మజ్దూర్ సంఘ్ నిరంతరం పోరాడుతోంది : కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ

5views

విశాఖపట్నం: పారిశ్రామిక ప్రగతి, కార్మిక సంక్షేమం సమన్వయంతోనే వికసిత్ భారత్–2047 లక్ష్యాన్ని సాకారం చేసుకోగలమని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.

విశాఖపట్నంలో భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ఆధ్వర్యంలో ఇటీవల జూలైలో జరిగిన BRICS ట్రేడ్ యూనియన్ సదస్సు ఫలితాలు–కార్మికుల ఆకాంక్షల ప్రతిబింబంపై నిర్వహించిన చర్చా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా BMS ప్రచురించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

కార్మికుల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత కోసం నిరంతరం పోరాడుతున్న భారతీయ మజ్దూర్ సంఘ్ నిబద్ధతను మంత్రి అభినందించారు. దేశ పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని, పరిశ్రమల పురోగతితో పాటు కార్మికుల సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

BRICS వేదికగా ట్రేడ్ యూనియన్లు, కార్మికుల సమస్యలు, హక్కులు, సామాజిక భద్రత వంటి అంశాలపై జరిగిన చర్చలు కార్మికుల ఆకాంక్షలను ప్రతిబింబించాయని ఆయన తెలిపారు. సమర్థవంతమైన పారిశ్రామిక విధానాలతో పాటు కార్మికులకు మెరుగైన భద్రత, సంక్షేమం కల్పించినప్పుడే దేశ ఆర్థికాభివృద్ధి మరింత బలోపేతమవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో BMS జాతీయ అధ్యక్షుడు ఎస్. మల్లేశం, జాతీయ సంఘటన కార్యదర్శి బి. సురేంద్రన్, రాష్ట్ర అధ్యక్షుడు తంగిరాల రఘురామ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీఎస్ నాయుడు, రాష్ట్ర సంఘటనా కార్యదర్శి లోవ రెడ్డి తదితర BMS నాయకులు పాల్గొన్నారు.