News

మదర్సా పేరుతో విరాళాలు- పాక్‌కు టెర్రర్‌ ఫండింగ్‌ ఆరోపణలు- యువకుడు అరెస్ట్‌

8views

మదర్సా పేరుతో విరాళాలు సేకరించి వాటిని పాకిస్థాన్​లోని ఉగ్రవాద సంస్థకు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 24 ఏళ్ల యువకుడిని ఉత్తర్​ప్రదేశ్​ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. బిహార్​లోని చెందిన మహ్మద్​ జఫర్​ను మేరఠ్​లో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జైషే మహ్మద్ కోసం అతడు కొన్నేళ్లుగా పనిచేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు.

అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, పూర్ణియా జిల్లాలోని మిర్​గంజ్​కు చెందిన వ్యక్తి ఈ మహ్మద్ జఫర్​. అతడి కదలికలపై కొంతకాలంగా నిఘా పెట్టారు. జఫర్​కు సంబంధించిన ఆధారాలను సేకరించిన తర్వాత ఆదివారం మేరఠ్​ కోత్వాలీ పోలిస్​ స్టేషన్​ పరిధిలోని ఓ మసీదు వద్ద అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. మసీదు పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విరాళాలు సేకరించి వాటిని జైషే మహ్మద్​కు చేరవేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. భారత్​లో హింసాత్మక కార్యకలాపాలకు ఆ నిధులను వినియోగించాలన్న ఉద్దేశంతో ఈ వ్యవహారం సాగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు వెల్లడించారు.

ముజాహిద్‌గా మారాలనుకున్న జఫర్
జఫర్‌ జైషే మహ్మద్‌లో చేరి ‘ముజాహిద్‌’గా మారాలని భావించినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. చదువుకునే సమయంలో జైషే మహ్మద్‌ గురించి తెలుసుకున్నానని, ఆ తర్వాత మౌలానా మసూద్‌ అజహర్‌ భావజాలానికి ప్రభావితమైనట్లు జఫర్‌ చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. 2020 నుంచి మసూద్‌ అజహర్‌కు సంబంధించిన సాహిత్యాన్ని ఉపయోగించి ఇతరులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపించింది. సోషల్‌ మీడియా కార్యకలాపాలను పరిశీలించగా, రెచ్చగొట్టే ప్రసంగాలను షేర్‌ చేస్తూ హింసాత్మక జిహాద్‌ వైపు ప్రజలను ప్రేరేపించే ప్రయత్నం చేసినట్లు గుర్తించినట్లు తెలిపింది.

సోషల్‌ మీడియానే వేదికగా
జఫర్‌ మొబైల్‌ ఫోన్‌లో పాకిస్థాన్‌కు సంబంధించిన పలు జిహాదీ వాట్సాప్‌ గ్రూపులు ఉన్నట్లు ఏటీఎస్‌ పేర్కొంది. వాటిలో జిహాద్‌, విరాళాల సేకరణకు సంబంధించిన సంభాషణలు ఉన్నట్లు తెలిపింది. అతడు ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ముఖాన్ని కప్పుకున్న చిత్రాలతో జిహాద్‌, ఖిలాఫత్‌ వంటి అంశాలపై వ్యాఖ్యలు, ప్రసంగాలను ప్రచారం చేసేవాడని ఆరోపించింది. అనంతరం జైషే మహ్మద్‌కు సంబంధించిన ఆన్‌లైన్‌ గ్రూపుల్లో చేరి పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో పరిచయం పెంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని అధికారులు తెలిపారు.

బినాన్స్‌ ద్వారా నిధుల బదిలీ?
టెర్రర్‌ ఫండింగ్‌కు సంబంధించి కూడా కీలక ఆధారాలు లభించినట్లు యూపీ ఏటీఎస్‌ వెల్లడించింది. తొలుత పాకిస్థాన్‌లోని ఓ ఖాతాకు నేరుగా డబ్బు పంపేందుకు జఫర్‌ ప్రయత్నించినప్పటికీ అది విజయవంతం కాలేదని తెలిపింది. ఆ తర్వాత బినాన్స్‌ ఖాతాను కోరినట్లు పాకిస్థాన్‌కు చెందిన అనుమానిత వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకుని క్రిప్టోకరెన్సీ రూపంలో యూఎస్‌డీటీని పలుమార్లు బదిలీ చేసినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు చెప్పారు. అతడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ ఆధారాలను నిపుణులు విశ్లేషిస్తున్నారని తెలిపారు. విచారణలో జఫర్‌ తన నేరాలను అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

పలు సెక్షన్ల కింద కేసు నమోదు
జఫర్​పై భారతీయ న్యాయ సంహితలోని 18, 38 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు యూపీ పోలీసులు తెలిపారు. ఉగ్రవాద చర్యకు కుట్రకు సంబంధించిన నిబంధనలు, ఉగ్రవాద సంస్థతో సంబంధాలు లేదా దాని కార్యకలాపాల్లో భాగస్వామ్యం వంటి అంశాలపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే కేసులోని ఆరోపణలు దర్యాప్తులో ఉన్నాయని, జఫర్‌ నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్‌ ఆధారాలను పూర్తిగా విశ్లేషించిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, జఫర్​ అరెస్ట్ విషయం తెలియడంతో ఆ గ్రామంలో కలకలం రేగింది. అతడి కుటుంబ సభ్యులు ఇల్లు విడిచి వెళ్లినట్లు స్థానికంగా సమాచారం.