News

ధ్రువ్ రాఠీ వీడియోపై చర్యలు.. భారత్‌లో నిలిపివేసినట్లు ఢిల్లీ హైకోర్టుకు గూగుల్ వెల్లడి

11views

న్యూఢిల్లీ: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చెందిన వివాదాస్పద వీడియోను భారత్‌లో నిలిపివేసినట్లు గూగుల్ సంస్థ ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC) ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నట్లు గూగుల్ కోర్టుకు తెలిపింది.

హిందూ దేవతలపై అభ్యంతరకరమైన, మత విశ్వాసాలను దెబ్బతీసే వ్యాఖ్యలు వీడియోలో ఉన్నాయని ఆరోపిస్తూ న్యాయవాది అమితా సచ్‌దేవా న్యాయపోరాటం చేస్తున్నారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సీతాదేవిని అవమానించేలా తప్పుడు, తప్పుదోవ పట్టించే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని ఆమె ఆరోపించారు.

ఈ వ్యవహారంలో జూలై 3న ఢిల్లీ హైకోర్టు.. సచ్‌దేవా దాఖలు చేసిన అప్పీల్‌పై 15 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని GACని ఆదేశించింది. అనంతరం జూలై 15న GAC.. సంబంధిత వీడియోపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని గూగుల్‌ను ఆదేశించింది.

అయితే వీడియోను ప్రపంచవ్యాప్తంగా తొలగించకుండా, భారత్‌లో మాత్రమే యాక్సెస్‌ను నిలిపివేశామని గూగుల్ కోర్టుకు తెలిపింది. వీడియోపై ప్రపంచవ్యాప్త నిషేధానికి సంబంధించిన అంశం ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ పరిధిలో ఇప్పటికే పెండింగ్‌లో ఉందని గూగుల్ తరఫు న్యాయవాది వివరించారు.

వీడియోను ప్రపంచవ్యాప్తంగా కూడా తొలగించాలని అమితా సచ్‌దేవా కోరుతున్నప్పటికీ, ఆ అంశంపై ఇప్పటికే డివిజన్ బెంచ్‌లో విచారణ కొనసాగుతోందని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది.

ఈ కేసు నేపథ్యంలో సోషల్ మీడియా వేదికలపై మత విశ్వాసాలను దెబ్బతీసేలా భావించే కంటెంట్, వ్యక్తి స్వేచ్ఛ, డిజిటల్ వేదికల బాధ్యత వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది.