
ముంబై : ముంబైలోని ‘ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైట్ నేషన్స్’ (I.I.M.U.N.) 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2,000 మంది జెన్ జీ విద్యార్థులతో ఆయన సంభాషించారు. ఈ సందర్భంగా సమాజంలో మహిళల పాత్ర, మహిళా నాయకత్వంతో పాటు ఆరెస్సెస్ కేవలం పురుషుల సంస్థగానే ఎందుకు పనిచేస్తోందన్న అంశాలపై భాగవత్ సమాధానమిచ్చారు.
ప్రశ్న : ప్రస్తుత సమాజంలో భారతీయ మహిళ పాత్ర ఏమిటి? దేశ నిర్మాణంలో మహిళలు సమాన భాగస్వాములని ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తుంటే, ‘రాష్ట్ర సేవికా సమితి’ ప్రత్యేకంగా పనిచేస్తుండగా ఆర్‌ఎస్‌ఎస్ మాత్రం కేవలం పురుషులతో కూడిన సంస్థగానే ఎందుకు కొనసాగుతోంది? ఆర్‌ఎస్‌ఎస్ యొక్క ప్రధాన సంస్థాగత నిర్మాణంలో మహిళలు ఎందుకు భాగం కాదు?
సమాధానం : భారతీయ సమాజంలోనే కాకుండా, అన్ని చోట్లా మహిళల పాత్ర ఉంది. స్త్రీ పురుషులు సమానులని, ఒకరికొకరు పూరకమని మేము భావిస్తాము. కాబట్టి, పురుషులకు సామర్థ్యాల విషయంలో శిక్షణ ఇచ్చినట్లే మహిళలకు కూడా శిక్షణ ఇవ్వాలి. పురుషులు చేయగలిగిన పనులన్నీ మహిళలు కూడా చేయగలరు; అందుకే అన్ని రకాల పనులకూ వారికి శిక్షణ ఇవ్వాలి.
అదే మా అభిప్రాయం. స్వయంసేవకులు నిర్వహిస్తున్న అన్ని సంస్థలలోనూ, పురుషులతో సమానంగా మహిళలు కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్ (RSS) విషయంలో మాత్రం అలా లేదు; దానికి ఒక కారణం ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ ప్రారంభమైనప్పుడే, మహిళల కోసం ఒక ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు అయ్యింది. ఆ కాలం అటువంటిది. అప్పట్లో ప్రత్యేక సంస్థలు ఉండటం చాలా సహజమైన విషయం కాబట్టి, అప్పుడు ఈ ప్రశ్న తలెత్తే అవకాశం ఉండేది కాదు.’’ అని అన్నారు.
రెండో అంశం… అదే లక్ష్యంతో మహిళల లక్ష్యంగా ఏర్పాటు చేసిన సేవికా సమితికి కూడా శిక్షణతో సహా అన్ని అంశాల్లో ఆరెస్సెస్ పూర్తి మద్దతు గతంలోనూ వుండేది, ఇప్పుడు కూడా వుంది. ఇక ముందూ వుంటుంది. అయితే వారు మాతో ఇలా అన్నారు: “మేము ఇక్కడ పని చేస్తాము, మీరు జోక్యం చేసుకోకండి. మీరు అక్కడ పని చేయండి, మేము జోక్యం చేసుకోం. మనం ఒకరికొకరం సహకరించుకుందాం”. వారు ఆ విధానాన్ని ఉపసంహరించుకున్నప్పుడు, మేము మహిళల మధ్య పని చేయడం ప్రారంభిస్తాం’’ అని అన్నారు. అంతేకాకుండా ఆరెస్సెస్ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన అఖిల భారత ప్రతినిధి సభలో ప్రజా రంగంలో పనిచేస్తున్న మహిళలను కూడా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగస్వాములను చేస్తామని, వారు కూడా ఆ మూడు రోజుల సమావేశాలకు హాజరవుతారన్నారు.



