News

ఒంగోలులో ఆడి కృతిక సందర్భంగా వైభవంగా వేల్ కావడి మహోత్సవం

35views

ఒంగోలు : ఆడి కృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలో గురువారం సుబ్రహ్మణ్య స్వామి వేల్ కావడి మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి మాలధారణ చేసిన భక్తులు కావడులు ధరించి కేశవస్వామిపేటలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి ఆయుధమైన వేలాయుధాన్ని శరీరానికి గుచ్చుకుని మేళతాళాలు, కేరళ డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ నగరంలోని గాంధీ రోడ్డు, కోర్టు సెంటర్ మీదుగా స్కందగిరిపై ఉన్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేల్ కావడి మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మేళతాళాలు, సాంప్రదాయ వాయిద్యాల ప్రదర్శనలు ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వేల్ కావడి ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి తిరున్వేలి కన్నయాచారి మాట్లాడుతూ, గత 60 సంవత్సరాలుగా ఒంగోలులో ఆడి కృతిక సందర్భంగా ఈ మహోత్సవాన్ని నగరోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు కావడి ధరించి, ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా వేలాయుధాన్ని శరీరానికి గుచ్చుకుని ఉత్సవంలో పాల్గొంటారని చెప్పారు.

ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.