
న్యూఢిల్లీ: దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. ఢిల్లీలోని శ్రీ రామ్‌లీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ చిత్ర బృందానికి లేఖ రాసి, సినిమా విడుదలకు ముందు ప్రత్యేక ప్రదర్శన నిర్వహించాలని కోరారు. తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకపోతే నిరసనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
హిందూ మనోభావాలకు భంగం కలగకూడదన్న ఉద్దేశమే..
హిందూ మత విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీసే అంశాలు సినిమాలో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు అర్జున్ కుమార్ తెలిపారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌ను చూసిన తర్వాత కొన్ని అంశాలపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు.
‘‘ఈ సినిమాను మేము స్వాగతిస్తున్నాం. లక్షలాది మంది ప్రేక్షకులు దీనిని చూడాలని కోరుకుంటున్నాం. రామ్‌లీలా కమిటీ సభ్యుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తాం. అయితే ట్రైలర్‌లో కొన్ని భావోద్వేగాలు, కొన్ని పాత్రల వస్త్రధారణ ఆశించిన స్థాయిలో లేవని అనిపించింది. అందుకే సినిమా విడుదలకు ముందు మాకు చూపించాలి’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
‘ఆదిపురుష్’ వివాదం నేపథ్యంలో విజ్ఞప్తి
గతంలో విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలపై వివాదాలు తలెత్తిన విషయాన్ని ప్రస్తావించిన అర్జున్ కుమార్, అలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ముందస్తు చర్యగా ప్రత్యేక ప్రదర్శన కోరుతున్నట్లు తెలిపారు.
సినిమాలో కొన్ని సన్నివేశాలు లేదా సంభాషణలు అభ్యంతరకరంగా ఉండే అవకాశం ఉందనే సమాచారం తమకు అందిందని, వాటిని ముందుగానే పరిశీలించి అవసరమైతే తొలగించాలని చిత్ర బృందాన్ని కోరారు. ఒకవేళ తమ అభ్యర్థనను పట్టించుకోకుండా అభ్యంతరకర అంశాలతో సినిమా విడుదలైతే థియేటర్ల వద్ద నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
దీపావళికి తొలి భాగం విడుదల
నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. యశ్ రావణుడి పాత్రను పోషించడంతో పాటు నమిత్ మల్హోత్రాతో కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ‘రామాయణ: పార్ట్ 1’ ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు.




