పవిత్రమైన శ్రావణ మాసంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన శివ విగ్రహాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఛత్తీస్‌గఢ్‌లోని “రుద్ర-శివ విగ్రహం” మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బిలాస్‌పుర్ జిల్లాలోని తాలా గ్రామంలో కొలువై ఉన్న ఈ అపూర్వ శిల్పాన్ని దర్శించేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు, చరిత్ర పరిశోధకులు, పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ విగ్రహాన్ని ఒక్కసారి చూసిన తర్వాత తమ ప్రయాణం సార్థకమైందని భక్తులు భావిస్తుంటారు.
మనియారి నదీ తీరంలో ఉన్న ‘దేవరాణి-జేఠాని’ ఆలయ సముదాయం భారతీయ శిల్పకళకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రకృతి అందాల మధ్య వెలసిన ఈ ప్రాచీన ఆలయ సముదాయం చరిత్ర, ఆధ్యాత్మికత, పురావస్తు సంపదలకు ప్రతీకగా నిలిచింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న రుద్ర-శివ విగ్రహం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
తవ్వకాల్లో వెలుగులోకి వచ్చిన అద్భుతం
భారత పురావస్తు శాఖ 1977లో ఈ ప్రాంతాన్ని సర్వే చేసింది. అనంతరం 1984లో తవ్వకాలు ప్రారంభించగా అనేక పురావస్తు అవశేషాలు బయటపడ్డాయి. 1987లో భారీ పరిమాణంలో ఉన్న ఒక విశిష్టమైన శిల్పం వెలుగులోకి రావడంతో పురావస్తు నిపుణులు విస్తృతంగా అధ్యయనం చేశారు. అనంతరం దానికి ‘రుద్రశివ’ అని పేరు పెట్టారు. ఈ ఆవిష్కరణతో తాలా గ్రామం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
దేవరాణి-జేఠాని ఆలయాల చరిత్ర
ఐదో, ఆరో శతాబ్దాల మధ్య శరభపురి రాజవంశానికి చెందిన రాజకుటుంబంలోని ఇద్దరు కోడళ్లు ఈ ఆలయాలను నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. తమ్ముడి భార్య నిర్మించిన ఆలయాన్ని దేవరాణి ఆలయం, అన్నయ్య భార్య నిర్మించిన ఆలయాన్ని జేఠాని ఆలయంగా పిలుస్తారు. అందుకే ఈ ఆలయ సముదాయం ‘దేవరాణి-జేఠాని ఆలయాలు’గా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం దేవరాణి ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పటికీ, దాని వైభవం ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే రుద్ర-శివ రూపం
ఈ రుద్రశివ విగ్రహం ప్రత్యేకత దాని శిల్ప నిర్మాణంలోనే ఉంది. శివుడి శరీరమంతా అనేక జీవరాశులు, ప్రకృతి ప్రతీకలను అద్భుతంగా చెక్కారు. శివుడి తలపై శేషనాగు, తలపాగా స్థానంలో సర్పాలు, కళ్లలో కప్పలు, మీసాలపై చేపలు, చెవుల వద్ద నెమళ్లు, గడ్డంపై పీత, పొట్టపై మహాకాల స్వరూపం, తొడలపై మహిళా ముఖాలు, మోకాళ్ల వద్ద సింహాల ఆకృతులు చెక్కడం ఈ విగ్రహాన్ని ప్రపంచంలోనే అరుదైన శిల్పంగా నిలబెట్టింది. ప్రారంభంలో ఈ విగ్రహాన్ని పశుపతినాథుడు, కాలభైరవుడు, కాలపురుషుడు వంటి పేర్లతో పిలిచినా, శివపురాణం, శిల్పశాస్త్రాల ఆధారంగా అధ్యయనం చేసిన తర్వాత దీనిని రుద్రశివ రూపంగా గుర్తించారు.
రుద్ర స్వరూపానికి ప్రతీక
స్థానిక ఆలయ సేవాదారులు, పండితుల ప్రకారం ఈ విగ్రహం శివుడి రుద్ర స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. భయం, విషం, వేగం, ఉగ్రత్వం వంటి నాలుగు భావాలను ఇందులో ప్రతిష్ఠించినట్లు వారు వివరిస్తున్నారు. జీవరాశులతో అలంకరించిన ఈ విగ్రహం అప్పటి శిల్పుల అసాధారణ సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తోంది. దీనిని భారతీయ శిల్పకళలో అత్యంత అరుదైనదిగా భావిస్తున్నారు. అందుకే ఈ విగ్రహాన్ని చూసేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తుంటారు.
ఆధ్యాత్మిక కేంద్రంగా తాలా గ్రామం
పురావస్తు ప్రాధాన్యంతో పాటు తాలా గ్రామం ధార్మిక క్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది. 1947లో స్వామి పూర్ణానంద మహారాజ్ ఇక్కడికి వచ్చిన అనంతరం సిద్ధనాథ్ ఆశ్రమం, గోశాల, సిద్ధనాథ్ ఆలయం, రామ–జానకీ ఆలయాలు నిర్మించారు. దీంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారింది. 2004 నుంచి స్థానిక ప్రజల శ్రమదానం, ప్రజా సహకారంతో ఆలయ సముదాయం అభివృద్ధి పనులు చేపట్టగా, అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించింది. శివబారాత్ వంటి ధార్మిక కార్యక్రమాల ద్వారా ఈ క్షేత్రానికి మరింత ప్రచారం లభించింది. ఈ రుద్ర-శివ విగ్రహం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు వచ్చిందని ఆలయ సేవాదార్ ప్రవీణ్ కుమార్ వైష్ణవ్ తెలిపారు. 2006 నుంచి శివుని వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ‘శివ బారాత్’ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
భక్తులు, పరిశోధకులకు ఆకర్షణ
ప్రస్తుతం తాలా గ్రామం ఛత్తీస్‌గఢ్ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచింది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు, పర్యటకులు, పరిశోధకులు ఇక్కడికి చేరుకుని రుద్రశివ విగ్రహాన్ని దర్శిస్తుంటారు. భారతీయ శిల్పకళ కేవలం రాతిని చెక్కడం మాత్రమే కాదని, అందులో సంస్కృతి, ఆధ్యాత్మికత, తాత్వికతను కూడా మేళవించగలిగిన గొప్ప సంప్రదాయం ఉందని ఈ ఆలయ సముదాయం చాటిచెబుతోంది. తాలా గ్రామం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం ద్వారా కార్లు, బైక్‌లు లేదా ఇతర వాహనాల్లో సులభంగా చేరుకోవచ్చు. చరిత్ర, పురావస్తు, శిల్పకళ, ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్నవారికి తాలా గ్రామంలోని రుద్రశివ ఆలయ దర్శనం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందిస్తుంది.





