News

ఆలయాలు సంస్కృతి పరిరక్షణకు శిక్షణ కేంద్రాలుగా మారాలి

30views

విజయవాడ : ఆలయాలను కేవలం పూజా కేంద్రాలకే పరిమితం చేయకుండా భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళలు, ఆధ్యాత్మిక విలువలను భావితరాలకు అందించే సాంస్కృతిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కోరారు.

ఆలయాలు భక్తి కేంద్రాలతో పాటు భారతీయ వారసత్వాన్ని కాపాడే జీవంతమైన విద్యా కేంద్రాలుగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన “జనతా వారధి” కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన కళాకారులు తమ సమస్యలను వివరించిన అనంతరం పీవీఎన్ మాధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ కార్యక్రమంలో భజన మండళ్లు, కోలాట బృందాలు, హరికథ కళాకారులు, జానపద కళాకారులు, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నృత్య కళాకారులు, బుర్రకథ, యక్షగానం, తోలుబొమ్మలాట, వీధి భాగవతం, చెక్కభజన, డప్పు, ధింసా, ఒగ్గుకథ, గరగ నృత్యం, నాగస్వరం–మంగళ వాయిద్య కళాకారులు, వేదపారాయణకులు, అన్నమాచార్య, త్యాగరాజ, రామదాసు కీర్తనల గాయకులు తమ సమస్యలను వెల్లడించినట్లు ఆయన తెలిపారు.

కళాకారుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందించాలని కోరుతూ జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు బీజేపీ తరఫున వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు.

ఆలయాల్లో ఉచిత సాంస్కృతిక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
సంప్రదాయ కళాకారులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయాల్లో అనుమతులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ప్రైవేట్ హాళ్లకు అధిక అద్దెలు చెల్లించాల్సి రావడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు సంప్రదాయ కళలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందన్నారు.

దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో దశలవారీగా ఉచిత సాంస్కృతిక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రతిరోజూ కనీసం గంటపాటు శిక్షణ అందించాలని సూచించారు. స్థానిక కళాకారులను పార్ట్‌టైమ్ శిక్షకులుగా నియమించి గౌరవప్రదమైన పారితోషికం ఇవ్వడంతో పాటు, శిక్షణ పూర్తిచేసిన వారికి ధ్రువపత్రాలు, ఆలయ ఉత్సవాల్లో ప్రదర్శన అవకాశాలు కల్పించాలని కోరారు.దీనివల్ల సంప్రదాయ కళల పరిరక్షణతో పాటు యువతలో సాంస్కృతిక చైతన్యం పెరుగుతుందని, కళాకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు.

ఆలయ ఉత్సవాల్లో కళాకారుల ఎంపికకు పారదర్శక విధానం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బ్రహ్మోత్సవాలు, రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల ఉత్సవాలు, దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు కళాకారుల ఎంపికలో పారదర్శక విధానం ఉండాలని పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సంప్రదాయ కళాకారుల నమోదు చేపట్టి, జిల్లా స్థాయిలో అర్హతలను పరిశీలించి డిజిటల్ డేటాబేస్ రూపొందించాలని సూచించారు. ఈ జాబితా ఆధారంగానే టీటీడీ, ప్రధాన ఆలయాలు, దేవాదాయ శాఖ ఆలయాల్లో కళాకారుల ఎంపిక చేపట్టాలని కోరారు.

ఎంపిక ప్రమాణాలు, కళాకారుల వివరాలు, పారితోషికం, ప్రదర్శనల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ప్రతి జిల్లాకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, కళాకారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆలయాలను సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళల పరిరక్షణకు కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమగ్ర విధానాన్ని రూపొందించాలని పీవీఎన్ మాధవ్ కోరారు.