News

పుట్టపర్తిలో సప్తమాతృకల ఉత్సవం వైభవం..

28views

పుట్టపర్తి : ఆషాఢ ఏకాదశిని పురస్కరించుకుని ఏడాదికి ఒకసారి నిర్వహించే సప్తమాతృక అక్కమహాదేవతల ఉత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెడపల్లి పంచాయతీ పరిధిలోని సుబ్బరాయునిపల్లి గ్రామ సమీప అటవీ ప్రాంతం చౌటవంకలో కొలువై ఉన్న సప్తమాతృక దేవతల జాతరకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు బాలికల కుంకుమార్చన, బాలుర నెమలి ఈకల నివేదన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సప్తమాతృక అక్కమహాదేవతల మూల విరాట్టులకు ప్రత్యేక అలంకరణలు చేసి, వెండి, బంగారు ఆభరణాలతో ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆదివారం సాయంత్రం అక్కమ్మ దేవతలకు ప్రతీకగా ఏడుగురు బాలికలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ముందు ఏర్పాటు చేసిన గద్దెపై వారికి కుంకుమార్చన నిర్వహించి, అనంతరం చేటలు అందజేసి అందులో పూజా సామగ్రిని ఉంచి సంప్రదాయ పద్ధతిలో కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

ఉత్సవాల్లో భాగంగా ఎడ్ల బండ్ల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా నలుమూలల నుంచి మాత్రమే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అక్కమహాదేవతలను దర్శించుకున్నారు.