
రాజధాని అమరావతిలో అటవీ విస్తీర్ణాన్ని పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు అటవీశాఖ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. మూడు లక్షల విత్తన బంతులను (సీడ్ బాల్స్) డ్రోన్ల సహాయంతో కొండ ప్రాంతాల్లో వెదజల్లింది.
రాజధానికి ముఖద్వారంగా ఉన్న మంగళగిరి, తాడేపల్లి పరిధిలోని ఎయిమ్స్ సమీప మంగళగిరి కొండలు, అలాగే ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం ప్రాంతాల్లోని సుమారు 500 హెక్టార్ల కొండ ప్రాంతం ఈ కార్యక్రమానికి ఎంపికైంది. డ్రోన్ల ద్వారా విత్తన బంతులను చల్లడం వల్ల చేరుకోలేని ప్రాంతాల్లో కూడా మొక్కలు పెరిగే అవకాశాలు మెరుగుపడనున్నాయి.
ఈ కార్యక్రమంలో విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి, వృక్ష సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ఈ కొండలను దట్టమైన అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అటవీ రేంజ్ అధికారి శ్రీవిద్య తెలిపారు.
అమరావతిని హరిత రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ చర్యల్లో ఇది కీలక ముందడుగుగా అధికారులు పేర్కొన్నారు.





