
చిత్తూరు: చిత్తూరు జిల్లా వి.కోట మండలంలోని పట్రపల్లి గ్రామంలో పురాతన వినాయకుడి రాతి విగ్రహం వెలుగుచూసింది. రైతు ఇంటి సమీపంలో తవ్వకాలు చేపడుతుండగా ఈ విగ్రహం బయటపడటంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
స్థానికుల కథనం ప్రకారం.. పట్రపల్లి గ్రామానికి చెందిన రైతు సుబ్బన్న తన ఇంటి ఆవరణలో ఆవును కట్టేందుకు పెద్ద రాయిని పాతాలని గడ్డపారతో తవ్వుతుండగా భూమిలో పురాతన వినాయకుడి రాతి విగ్రహం కనిపించింది. దీంతో ఆయన వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు.
విషయం తెలిసిన గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని వినాయకుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విగ్రహం పురాతన కాలానికి చెందినదిగా భావిస్తున్న స్థానికులు, దానిని భద్రపరచి సమీపంలోని ఆలయంలో ప్రతిష్ఠించాలని గ్రామ పెద్దలు, భక్తులు కోరుతున్నారు.
విగ్రహం వెలుగుచూడటంతో గ్రామంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుంటున్నారు.





