
ఆగ్రాలోని తాజ్ మహల్ గతంలో ‘తేజో మహాలయ్’ అనే శివాలయం అని పేర్కొంటూ దాఖలైన న్యాయపోరాటంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశానికి సంబంధించిన రిట్ పిటిషన్‌ను హరి శంకర్ జైన్‌తో పాటు మరో నలుగురు అలహాబాద్ హైకోర్టులో దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ధర్మాసనం, వివాదాస్పద ప్రాంగణంలో సర్వే, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ నిర్వహించేందుకు అడ్వకేట్ కమిషనర్‌ను నియమించాలన్న విజ్ఞప్తిపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి నోటీసులు జారీ చేసింది.
ఈ వివాదం కొత్తది కాదు. తాజ్ మహల్ నిర్మాణానికి ముందు అక్కడ ‘తేజో మహాలయ్’ అనే శివాలయం ఉండేదని వాదిస్తూ దాఖలైన మరో పిటిషన్ కూడా ప్రస్తుతం కోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉంది. ఈ రెండు పిటిషన్లపై సమాధానం దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, ASI అధికారులను ఆదేశించింది.
వాస్తవానికి ఈ చట్టపరమైన పోరాటం 2015లోనే ఆగ్రా సివిల్ కోర్టులో ప్రారంభమైంది. అనంతరం కట్టడం తనిఖీ కోసం దాఖలైన పిటిషన్లను సివిల్ కోర్టుతో పాటు అదనపు జిల్లా జడ్జి కోర్టు కూడా తిరస్కరించాయి. అయితే, స్థానిక విచారణ అవసరమా లేదా అనే ప్రాథమిక అంశాన్ని పరిశీలించకుండానే దిగువ కోర్టులు నిర్ణయం తీసుకున్నాయని పిటిషనర్లు వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారం ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు పరిశీలనలోకి వచ్చింది.





