News

ఆదోని రణమండల కొండ శివాలయ ఘటన.. వైరల్ వీడియోపై దర్యాప్తు

43views

 

కర్నూలు జిల్లా  ఆదోని నియోజకవర్గంలోని రణమండల కొండపై ఉన్న పురాతన శివాలయంలో పవిత్ర దీపంతో సిగరెట్ వెలిగించుకుని వీడియో చిత్రీకరించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై సమగ్ర విచారణ చేపట్టారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ వీడియో 2022లో చిత్రీకరించినదిగా గుర్తించారు. పవిత్ర దీపంతో సిగరెట్ వెలిగించడం ద్వారా హిందూ మత విశ్వాసాలను అవమానించే ఉద్దేశం ఉందని ఆరోపిస్తూ గౌలిపేటకు చెందిన బోయ శివరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా బీఎన్‌ఎస్ సెక్షన్ 299 కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ఆదోని మండలం విరూపాపురం గ్రామానికి చెందిన వడ్డె ఈరన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 2022లో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల సమయంలో ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ వీడియోను చిత్రీకరించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

అయితే నాలుగేళ్ల క్రితం చిత్రీకరించిన ఈ వీడియో ప్రస్తుతం ఎందుకు వైరల్ అయింది? దీని వెనుక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పనిచేశారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇటీవల హిందూ మతానికి సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వీడియోను వైరల్ చేసి మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మతాలు, కులాల మధ్య విభేదాలు సృష్టించి శాంతి-భద్రతలకు విఘాతం కలిగించే కుట్ర ఏదైనా ఉందా అనే దిశగా ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.