News

మసీదుల లౌడ్‌స్పీకర్లపై ఫిర్యాదులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలి: బాంబే హైకోర్టు

47views

ముంబై: మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాల్లో లౌడ్‌స్పీకర్ల వల్ల ధ్వని కాలుష్యంపై అందిన ఫిర్యాదులు, వాటిపై పోలీసులు తీసుకున్న చర్యలకు సంబంధించిన సమగ్ర నివేదికను రెండు వారాల్లోగా సమర్పించాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కండివాలికి చెందిన న్యాయవాది రీనా రిచర్డ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అజయ్ గడ్కరీ, జస్టిస్ కమల్ ఖటాలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ప్రతిరోజూ తెల్లవారుజామున సమీపంలోని మసీదు నుంచి లౌడ్‌స్పీకర్ ద్వారా అధిక శబ్దం వస్తోందని, ఈ విషయమై సమతా నగర్ పోలీస్ స్టేషన్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

విచారణ సందర్భంగా ముంబై పోలీసులు, లౌడ్‌స్పీకర్లను మసీదు లోపలి వైపు మళ్లించామని, శబ్దాన్ని తక్కువ డెసిబల్ స్థాయిలోనే ప్రసారం చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది, నోటిఫైడ్ సైలెన్స్ జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో లౌడ్‌స్పీకర్లు వినియోగిస్తున్నారని వాదించారు.

ఈ నేపథ్యంలో ధ్వని కాలుష్యానికి సంబంధించిన ఫిర్యాదులు, వాటిపై పోలీసులు చేపట్టిన చర్యల వివరాలను రెండు వారాల్లోగా అఫిడవిట్ రూపంలో సమర్పించాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.