News

సైనికుల త్యాగాలకు నివాళిగా- కశ్మీర్​లో 250 అడుగుల ఎత్తైన జాతీయ జెండా ఆవిష్కరణ

41views

శ్రీ అమర్‌నాథ్ యాత్రకు కీలక ప్రవేశ మార్గమైన జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా చందన్‌వాడిలో భారత సైన్యం భారీ జాతీయ జెండాను ఆవిష్కరించింది. భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ త్రివర్ణ పతాకం 250 అడుగుల ఎత్తులో రెపరెపలాడుతోంది. దక్షిణ కశ్మీర్‌లోనే అత్యంత ఎత్తైన జాతీయ జెండాగా దీన్ని సైన్యం దేశానికి అంకితం చేసింది.

పవిత్ర అమర్‌నాథ్ యాత్రలో పహల్గామ్ మార్గానికి ప్రవేశ ద్వారంగా భావించే చందన్‌వాడిలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యతను ప్రతిబింబించే వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో చినార్ కార్ప్స్‌కు చెందిన సీనియర్ సైనికాధికారులు, పౌర యంత్రాంగ ఉన్నతాధికారులు, ఇతర భద్రతా దళాల ప్రతినిధులు, మాజీ సైనికులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆర్మీ సెక్టర్ కమాండర్, కమాండింగ్ ఆఫీసర్, కాశ్మీర్ ఐజీ, దక్షిణ కాశ్మీర్ డీఐజీ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

జాతీయ ఐక్యతకు చిహ్నంగా
దక్షిణ కశ్మీర్‌లో ఇంత ఎత్తైన జాతీయ జెండాను ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం దేశభక్తి, జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలు, సాయుధ దళాల మధ్య బంధాన్ని మరింత పటిష్ఠం చేయడమేనని భారత సైన్యం వెల్లడించింది. అందమైన పర్వతాల మధ్య ఎగురుతున్న ఈ భారీ త్రివర్ణ పతాకం ప్రతి ఏడాది అమర్‌నాథ్ యాత్రకు వచ్చే లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు, స్థానిక ప్రజలకు జాతీయ ఐక్యత, స్థిరత్వం, ఉమ్మడి సంకల్పానికి చిహ్నంగా నిలుస్తుందని సైన్యం పేర్కొంది.

వీర జవాన్లకు నివాళిగా
దేశ సరిహద్దుల రక్షణతో పాటు జమ్మూకశ్మీర్‌లో శాంతి, స్థిరత్వం, సామాజిక-ఆర్థిక అభివృద్ధి, అమర్‌నాథ్ యాత్ర విజయవంతమైన నిర్వహణలో కూడా భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తోందని చినార్ కార్ప్స్ వెల్లడించింది. చందన్‌వాడిలో ఏర్పాటు చేసిన ఈ జాతీయ జెండా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు నివాళిగా నిలుస్తుందని సైన్యం పేర్కొంది. త్రివర్ణ పతాకం ఆశ, సామరస్యం, జాతీయ సమైక్యతకు శాశ్వత చిహ్నంగా భావిస్తున్నామని తెలిపింది. ఈ చొరవను స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. 250 అడుగుల ఎత్తులో రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం తమలో దేశభక్తిని మరింత పెంచిందని చెప్పారు. రానున్న తరాలకు జాతీయ ఐక్యత, దేశభక్తి సందేశాన్ని అందించడంతో పాటు భారత సాయుధ దళాల త్యాగాలను ఎప్పటికీ గుర్తు చేస్తుందని అభిప్రాయపడ్డారు.

అలాగే భద్రతా దళాలకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వారి అవిశ్రాంత కృషి, త్యాగాలు, నిరంతర అప్రమత్తత కారణంగానే, పౌరులు, అమర్‌నాథ్ యాత్రికులు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణంలో తమ మతపరమైన ఆచారాలు, ఇతర కార్యకలాపాలలో పాల్గొనగలుగుతున్నారని వారు పేర్కొన్నారు. దేశ సమగ్రత, ఐక్యత, శాంతిభద్రతలను కాపాడేందుకు రేయింబవళ్లు సేవలందిస్తున్న తమ వీర సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని వారు అన్నారు.