ArticlesNews

పాదాభివందనం… పరమార్థం!

39views

ఇటీవల క్రికెట్‌ ‌మైదానంలో కనిపించిన ఒక చిన్న దృశ్యం ఎంతోమందిని ఆలోచింపజేసింది. అసాధారణ బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న యువ క్రికెటర్‌ ‌వైభవ్‌ ‌సూర్యవంశీ, సీనియర్‌ ‌క్రికెటర్‌, శ్రీ‌లంక మాజీ కెప్టెన్‌ అనుర టెన్నెకూన్‌ ‌పాదాలకు నమస్కరించాడు. అది కేవలం కెమెరా కోసం చేసిన చర్యలా కనిపించలేదు. సహజంగా వచ్చిన సంస్కారంలా అనిపించింది. ప్రతిభతోపాటు వినయం ఉంటేనే వ్యక్తిత్వానికి పూర్తి అందం వస్తుందనే సందేశాన్ని ఆ దృశ్యం ఇచ్చింది.

అతని బ్యాటింగ్‌ ‌మ్యాచ్‌లను గెలిపించవచ్చు. కానీ ఆ వినయం ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది. చిన్న వయసులోనే పేరు, గుర్తింపు, ప్రశంసలు వస్తున్న సమయంలో కూడా పెద్దల పట్ల గౌరవం తగ్గకపోవడం మంచి పెంపకానికి నిదర్శనం. విజయానికి చేరువవుతున్న ప్రతి యువతరం నేర్చుకోవాల్సిన విషయం కూడా ఇదే.

మన దేశంలో తల్లిదండ్రులు, తాతమ్మలు, గురువులు, పెద్దలు, ఆధ్యాత్మిక గురువుల పాదాలకు నమస్కరించడం అనాదిగా ఉన్న ఆచారం. కానీ దీన్ని కేవలం ‘‘పెద్దలను గౌరవించడం’’ అనే ఒకే అర్థానికి పరిమితం చేయడం సరైంది కాదు. పరీక్షకు వెళ్లేముందు పిల్లలు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం, కొత్త ఉద్యోగానికి బయలుదేరే యువకుడు ఇంటి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, వివాహ సమయంలో వధూవరులు పెద్దలకు నమస్కరించడం, విద్యార్థి గురువును గౌరవించడం… ఇవి అన్నీ మన జీవితంలో మనకంటే ముందుగా నడిచిన వారి పాత్రను గుర్తించే సందర్భాలు.

‘‘మీరు నడిచిన దారిని నేను గౌరవిస్తున్నాను. మీరు నాకు చేసిన మేలును గుర్తిస్తున్నాను. నేను ముందుకు సాగుతున్నప్పుడు మీ దీవెనలు కావాలి’’ అని మాటల్లో చెప్పకుండానే తెలియజేసే సంస్కారం పాదాభివందనం.

ఇది చిన్నవారు పెద్దవారికంటే తక్కువవారని చెప్పే ఆచారం కాదు. ఎవరూ ఒంటరిగా ఎదగరనే సత్యాన్ని గుర్తుచేసే చర్య. ఒకరి ఎదుగుదల వెనుక తల్లిదండ్రుల త్యాగం, గురువుల బోధన, కుటుంబం ఇచ్చిన రక్షణ, సమాజం అందించిన అవకాశాలు ఉంటాయి. అందుకే పాదాలకు నమస్కరించడం అంటే అహాన్ని కాసేపు పక్కన పెట్టి, మన ఎదుగుదల వెనుక ఉన్న అనుబంధాలను గుర్తించడమే.

అయితే ఈ ఆచారంలో మనం మరిచిపోతున్న ఒక ముఖ్యమైన భాగం ఉంది- అది పెద్దలు ఇచ్చే ఆశీర్వాదం.

కుటుంబ సమావేశాల్లో, స్నేహితుల ఇళ్లలో, పండుగల సందర్భంగా నేను తరచూ చూసే దృశ్యం ఇది. చిన్నవాడు లేదా యువకుడు పాదాలకు నమస్కరించగానే కొందరు పెద్దలు ఇబ్బందిగా పక్కకు తప్పుకుంటారు. కొందరు నవ్వేస్తారు. ఇంకొందరు ‘‘గాడ్‌ ‌బ్లెస్‌ •••’’ అని హడావిడిగా చెప్పి ఆ క్షణాన్ని ముగించేస్తారు. మరికొందరు ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటారు. ఇది వారి తప్పు మాత్రమే కాదు. పాదాభివందనం చేయడం నేర్పాం కానీ, దానికి ఎలా స్పందించాలో నేర్చుకో లేదు. పెద్దల ఆశీర్వాదం కూడా ఒక బాధ్యత అని మనం మరచిపోయాం.

ఆశీర్వదించడం పెద్దల బాధ్యతే

ఆశీర్వాదం అంటే ఆడంబరంగా సంస్కృత పదాలు చెప్పడం కాదు. ఎదుటి వ్యక్తి మంచిని మనస్ఫూర్తిగా కోరడం. ‘‘ఆరోగ్యంగా ఉండు’’, ‘‘నీ ప్రయత్నాలు ఫలించాలి’’, ‘‘మంచి మార్గంలో ఎదుగు’’, ‘‘ఉద్యోగం రావాలి’’, ‘‘సుఖంగా ఉండాలి’’, ‘‘నిన్ను మించి నువ్వే ఎదగాలి’’ అని చెప్పడమే ఆశీర్వాదం.

అలాంటి మాటలు చెప్పడానికి కొన్ని క్షణాలే పడుతుంది. కానీ అవి ఒక పిల్లవాడిలో, ఒక యువతిలో, ఒక ఉద్యోగార్థిలో గొప్ప నమ్మకాన్ని నింపగలవు. ఒక పరీక్షకు బయలుదేరుతున్న బాలుడికి ‘‘ధైర్యంగా రాయి, బాగా రాస్తావు’’ అని పెద్దలు చెప్పడం, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యువకుడికి ‘‘నీకు సరైన అవకాశం వస్తుంది’’ అని ప్రోత్సహించడం, కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న జంటకు ‘‘సుఖసంతోషాలతో ఉండండి’’ అని దీవించడం వంటివన్నీ మాటలకంటే ఎక్కువ.

సంస్కృతంలో తెలిసినవారు సందర్భానుసారంగా ‘‘దీర్ఘాయుష్మాన్‌భవ’’, ‘‘విజ• భవ’’, ‘‘సుఖీభవ’’, ‘‘ఉద్యోగప్రాప్తిరస్తు’’, ‘‘ఇష్టకార్యసిద్ధిరస్తు’’ వంటి పదాలను ఉపయోగించవచ్చు. కానీ సంస్కృతం తప్పనిసరి కాదు. తెలుగు మాటలో చెప్పిన ఆశీర్వాదానికీ అదే బలం ఉంటుంది. భాష కంటే మనసు ముఖ్యం.

ఈ ఆచారం ఎందుకు చేయాలో యువతరానికి చెప్పకుండా, కేవలం చేయమని చెప్పడం వల్లే అది యాంత్రికంగా మారుతోంది. కొందరు సగం వంగుతారు. కొందరు పాదాలను తాకకుండానే చేతిని అటూ ఇటూ ఊపుతారు. ఇంకొందరు ‘‘చరణ్‌ ‌స్పర్శ్’’, ‘‘‌పాయ్‌ ‌లాగూ’’ అని మాత్రమే అంటారు. మరికొందరు చుట్టూ ఉన్నవారు చూస్తున్నారు కాబట్టి చేస్తారు. ఇవన్నీ తప్పే అని చెప్పలేం. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన పద్ధతి ఉంటుంది. చేతులు జోడించి నమస్కరించడం, తలవంచి పలకరించడం, ఆలింగనం చేసుకోవడం, శ్రద్ధగా వినడం, సేవ చేయడం, మర్యాదగా మాట్లాడటం… ఇవన్నీ గౌరవానికి రూపాలే.

అయితే పాదాభివందనం చేస్తున్నప్పుడు దాని వెనుక భావం ఉండాలి. బంధువులు చూస్తున్నారు కాబట్టి చేసే నాటకం కాకూడదు. ప్రతి ఒక్కరి ముందు, ప్రతి సందర్భంలో, కేవలం వయసు ఎక్కువగా ఉందన్న కారణంతో చేయాల్సిన యాంత్రిక చర్యగా మారకూడదు. వయసు పెరిగినంత మాత్రాన ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులవుతారని చెప్పలేం. దయ, త్యాగం, జ్ఞానం, నైతికత, కుటుంబం పట్ల బాధ్యత- ఇవి ఉన్నప్పుడు ఆ గౌరవానికి నిజమైన అర్థం ఉంటుంది. పాదాభివందనం ఎవరికి పడితే వారికి చేసే హావభావం కాదు. ప్రేమ, ఆప్యాయత, జ్ఞానం, సేవాభావం, నైతిక గౌరవం ఉన్న సంబంధా ల్లోనే దానికి నిజమైన స్థానం ఉంటుంది.

ఇక్కడ మరో తేడా స్పష్టంగా తెలుసుకోవాలి. వినయం వేరు, లొంగుబాటు వేరు. ప్రేమతో తాతమ్మల పాదాలకు నమస్కరించే మనవడు ఒకరు, అహంకారంతో వ్యవహరించే అధికారి ముందు భయంతో వంగే ఉద్యోగి ఇంకొకరు. గురువు ఆశీర్వాదం కోరే విద్యార్థి ఒకరు, తనను తాను గొప్పవాడిగా ప్రకటించుకున్న వ్యక్తి ముందు ఒత్తిడితో నమస్కరించే అనుచరుడు ఇంకొకరు.

ఏ సంప్రదాయవ• గుడ్డి విధేయతను కోరడానికి, ప్రశ్నలను అణచివేయడానికి, కులం లేదా హోదా ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి ఉపయోగ పడకూడదు. తన పాదాలకు నమస్కరిస్తేనే తనను గౌరవిస్తున్నట్టుగా భావించే వ్యక్తి ఈ సంప్రదాయం అసలు అర్థాన్ని గ్రహించలేదని చెప్పాలి.

నిజమైన పెద్దలు గౌరవాన్ని అడగరు, తమ ప్రవర్తనతో సంపాదిస్తారు. పిల్లవాడు పాదాలకు నమస్కరించినప్పుడు ‘‘నా గొప్పతనం గుర్తించాడు’’ అని అనుకోరు. ‘‘ఈ బిడ్డ నా దీవెన కోరుతున్నాడు. నేను ప్రేమతో స్పందించాలి’’ అని భావిస్తారు. ‘‘మమ్మల్ని మించి ఎదుగు’’, ‘‘విజయం వచ్చినా మంచితనం విడువకు’’, ‘‘ఎవరినీ చిన్నచూపు చూడకు’’ అని చెప్పగలిగినప్పుడు పెద్దరికానికి అసలు అర్థం వస్తుంది.

సినీ ప్రముఖుల వేడుకల్లో పాదాభివందనాన్ని సరదాగా మార్చిన వీడియోలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒక నటుడు మరొకరి పాదాలకు నమస్కరించబోతున్నట్లు చేయడం, ఇంకొకరు తప్పించుకోవడం, చుట్టుపక్కలవారు నవ్వడం, చప్పట్లు కొట్టడం ఇప్పుడు సాధారణమైపోయింది.

హాస్యానికి స్థానం ఉంది. కానీ తరాలమధ్య గౌరవానికి ప్రతీకగా ఉన్న ఆచారాన్ని మళ్లీ మళ్లీ చవకబారు వినోదంగా మార్చినప్పుడు, ప్రజల మనసుల్లో దాని విలువ తగ్గిపోతుంది. ఈ ఆచారంలో ఉన్న కృతజ్ఞత, ఆశీర్వాదం, పరస్పర బాధ్యత, అనుభవానికి ఇచ్చే గౌరవం వంటి అంశాలు కనిపించకుండా పోతాయి.

మన సమాజం వేగంగా మారుతోంది. యువతకు కొత్త జ్ఞానం, కొత్త అవకాశాలు, కొత్త ప్రపంచం అందుబాటులో ఉన్నాయి. అది మంచి పరిణామమే. కానీ ఆధునికత అంటే వ•లాలను వదిలేయడం కాదు. అలాగే సంప్రదాయం అంటే స్వేచ్ఛను వదులుకోవడం కూడా కాదు.

యువత ఉత్సాహం, ఊహాశక్తి, ధైర్యం, కొత్త ఆలోచనలను తీసుకొస్తుంది. పెద్దలు అనుభవం, దూరదృష్టి, జీవిత పాఠాలను అందిస్తారు. ఈ రెండు తరాల మధ్య అనుబంధం బలంగా ఉన్నప్పుడే కుటుంబం బలపడుతుంది; సమాజం ఆరోగ్యంగా ముందుకు సాగుతుంది.

వైభవ్‌ ‌సూర్యవంశీ పాదాభివందనం ఎంతో మందిని ఆకట్టుకున్నది అందుకే. అది ప్రదర్శనలా కనిపించలేదు. సహజంగా కనిపించింది. అతని తల్లిదండ్రులు అతనిలో నాటిన వినయం ప్రశంసించ దగ్గది. అదే సమయంలో, ఎవరికి, ఎప్పుడు, ఎంతవరకు గౌరవం చూపాలో గుర్తించే వివేకం కూడా అతనితో పాటు ఎదగాలని ఆశించాలి.

పాదాభివందనం అనే సంప్రదాయాన్ని పూర్తిగా వదిలేయడమో, ప్రశ్నించకుండా ప్రతి రూపాన్ని సమర్థించడమో రెండూ సరైన మార్గాలు కావు. దాని అసలు అర్థాన్ని మళ్లీ నేర్పాలి.

తల్లిదండ్రులు పిల్లలకు ఇది తమను తాము చిన్నచూపు చూసుకోవడం కాదని చెప్పాలి. ఇతరులు తమ కోసం చేసిన సేవను, త్యాగాన్ని గుర్తించే పరిపక్వత అని వివరించాలి. పెద్దలు స్పందించడం నేర్చుకోవాలి. ఆశీర్వాదం ఇవ్వాలి. యువత దీన్ని స్వచ్ఛందంగా, ఆత్మగౌరవంతో, ఎంపికతో ఆచరించాలి.

చిన్నవారు గౌరవాన్ని అందిస్తారు. పెద్దలు దీవెనలు అందిస్తారు. ఆ క్షణంలో ఇద్దరూ మరింత మానవీయంగా మారతారు. పాదాభివందనం వెనుక ఉన్న అసలు పరమార్థం కూడా అదే.

– హరికృష్ణ నిబనుపూడి