
అమర్‌నాథ్ యాత్రకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జులై 3న ప్రారంభమైన ఈ యాత్రలో తొలి మూడు రోజుల్లోనే 56,961 మంది పవిత్ర గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు.
ఆదివారం ఒక్కరోజే 24,648 మంది భక్తులు అమర్‌నాథ్ గుహను సందర్శించారు. అంతకుముందు రెండు రోజుల్లో 32,313 మంది దర్శనం చేసుకున్నారు. దీంతో మొత్తం యాత్రికుల సంఖ్య 56 వేల మార్కును దాటింది.
అనంత్‌నాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల సంప్రదాయ పహల్గామ్ మార్గం, గందర్‌బల్ జిల్లాలోని 14 కిలోమీటర్ల బాల్తాల్ మార్గం ద్వారా యాత్ర కొనసాగుతోంది. గుహ పరిసరాల్లో ఆదివారం మేఘావృత వాతావరణం ఉన్నప్పటికీ యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది.
దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రోజూ జమ్మూ, బాల్తాల్, నున్వాన్ బేస్ క్యాంపులకు చేరుకుంటున్నారు. దీంతో రెండు మార్గాల్లోనూ భారీ రద్దీ నెలకొంది.
భారీ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో జులై 9 వరకు రిజిస్ట్రేషన్ స్లాట్లు పూర్తిగా నిండిపోయాయని అధికారులు తెలిపారు. అందువల్ల నమోదు చేసుకోని భక్తులు కొన్ని రోజులు యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించారు.
ఆదివారం నుంచి రిజిస్ట్రేషన్ ఉన్న యాత్రికులను మాత్రమే కశ్మీర్ వైపు అనుమతిస్తున్నారు. నమోదు చేసుకోని భక్తులను చెక్‌పోస్టుల వద్ద నిలిపివేస్తున్నారు. జమ్మూలోని టోకెన్, రిజిస్ట్రేషన్ కేంద్రాల వద్ద కూడా భారీ క్యూలు కనిపించాయి. ఆదివారం ఐదు వేల మంది నమోదు చేసుకోని భక్తులను వేర్వేరు తేదీల్లో సర్దుబాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 57 రోజుల పాటు సాగే ఈ అమర్‌నాథ్ యాత్ర శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి రోజున ముగియనుంది.





