
( జూలై 4 – అల్లూరి సీతారామరాజు జయంతి )
భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఎన్నో ఉద్యమాలు చోటుచేసుకున్నాయి. కానీ అడవులను వేదికగా చేసుకుని గిరిజనులను ఏకం చేసి బ్రిటీష్ సామ్రాజ్యానికి సవాల్ విసిరిన విప్లవం మాత్రం ఒక్కటే… అదే రంప తిరుగుబాటు. కేవలం రెండేళ్లపాటు సాగిన ఈ సాయుధ పోరాటం బ్రిటీష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ విప్లవానికి నాయకత్వం వహించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
1897 జూలై 4న విశాఖ జిల్లా పాండ్రంగి గ్రామంలో జన్మించిన అల్లూరి సీతారామరాజు చిన్నప్పటి నుంచే అన్యాయాన్ని సహించని వ్యక్తిత్వాన్ని పెంపొందించుకున్నారు. భీమవరం, రాజమండ్రి, పిఠాపురం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే బ్రిటీష్ పాలనలో జరుగుతున్న దౌర్జన్యాలను గమనించిన ఆయన, ముఖ్యంగా మన్యం ప్రాంతంలోని గిరిజనుల దుస్థితిని చూసి తీవ్రంగా కలత చెందారు.
బ్రిటీష్ అధికారులు గిరిజనుల జీవనాధారమైన పోడు వ్యవసాయాన్ని నిషేధించారు. అడవుల్లో తేనె, వెదురు, ఇతర అటవీ ఉత్పత్తులు సేకరించకుండా అడ్డుకున్నారు. కూలీలతో వెట్టిచాకిరి చేయిస్తూ, సరైన కూలీ కూడా చెల్లించకుండా చిత్రహింసలకు గురిచేశారు. ఈ అన్యాయాలపై అల్లూరి అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో పోరాటమే మార్గమని నిర్ణయించుకున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో తిరుగుతూ గిరిజనుల్లో చైతన్యం నింపారు. మద్యం, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని బోధించారు. గెరిల్లా యుద్ధ విధానాలు నేర్పి గాము గంటందొర, గాము మల్లుదొర, ఎండుపడాల్, ఎర్రేసు వంటి వీరులతో కలిసి సాయుధ దళాన్ని ఏర్పాటు చేశారు. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి 11 తుపాకులు, వేలాది తూటాలను స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు కృష్ణదేవిపేట, ఆ తర్వాత రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై దాడి చేసి మరిన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో బ్రిటీష్ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అల్లూరి ధైర్యసాహసాలకు మరో ఉదాహరణ అడ్డతీగల, రంపచోడవరం పోలీస్ స్టేషన్లపై దాడులు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… తాను ఎక్కడ దాడి చేయబోతున్నానో ముందుగానే బ్రిటీష్ అధికారులకు సమాచారం ఇచ్చేవారు. అయినప్పటికీ ఆయనను అడ్డుకునే ధైర్యం వారికి ఉండేది కాదు. దీంతో అల్లూరి పేరు మన్యం అంతటా ఒక లెజెండ్‌గా మారిపోయింది.
అయితే బ్రిటీష్ ప్రభుత్వం ప్రత్యేక బలగాలను రంగంలోకి దించి ఉద్యమాన్ని అణచివేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. పెద్దగడ్డపాలెం వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో అల్లూరి అనుచరులు పలువురు అమరులయ్యారు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. కొంతకాలం అజ్ఞాతంలో ఉన్న తర్వాత 1923లో అన్నవరం, శంఖవరం ప్రాంతాల్లో ప్రత్యక్షమై మరోసారి బ్రిటీష్ అధికారులకు సవాల్ విసిరారు.
చివరకు 1924లో మన్యానికి కలెక్టర్‌గా వచ్చిన రూథర్‌ఫర్డ్ అమానుష చర్యలకు దిగాడు. గిరిజనులను చిత్రహింసలకు గురిచేస్తూ అల్లూరి ఆచూకీ కోసం వేట ప్రారంభించాడు. పరిస్థితి మరింత విషమించకుండా ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో అల్లూరి తన ఆచూకీని స్వయంగా తెలియజేశారని చరిత్ర చెబుతోంది. 1924 మే 7న ఆయనను అరెస్టు చేసిన బ్రిటీష్ అధికారులు ఎలాంటి విచారణ లేకుండానే కొయ్యూరులోని చింతచెట్టుకు కట్టి కాల్చిచంపారు. మరుసటి రోజు ఆయన భౌతికకాయాన్ని కృష్ణదేవిపేటలో దహనం చేశారు.
అల్లూరి సీతారామరాజు జీవితం కేవలం ఒక వ్యక్తి పోరాటం కాదు… అది గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆయన చూపిన ధైర్యం, త్యాగం, దేశభక్తి భారత స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు భారత చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.




