
భక్తులు అయోధ్యలోని రామాలయానికి ఇచ్చిన కానుకలు, విరాళాలు, వెండి ఇటుకలు, ఆభరణాలు సురక్షితంగానే ఉన్నాయని ‘రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్టు’ స్పష్టంచేసింది. ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రలు రాజీనామా చేయడం వాస్తవమేనని ధ్రువీకరించింది. వాటిపై ట్రస్టు తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామంది. ఆలయంలో వెలుగుచూసిన ఘటనలు దిగ్భ్రాంతికరం, విచారకరమని ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ గిరి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘రామ మందిరానికి ఇచ్చిన కానుకలన్నింటికీ రికార్డులు పక్కాగా ఉన్నాయి. భక్తుల విశ్వాసాన్ని తిరిగి చూరగొనేలా నిష్పాక్షిక విచారణకు ట్రస్టు నుంచి అన్నివిధాలా సహకారం ఉంటుంది. హుండీల ద్వారా వచ్చిన డబ్బు దుర్వినియోగం అయిందన్న ఆరోపణలపై యూపీ ప్రభుత్వం నియమించిన సిట్ నుంచి మధ్యంతర నివేదిక రాగానే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాం. ఇలాంటి ఘటనలు ఇకమీదట జరగబోవనిహామీ ఇస్తున్నాం’’ అని ట్రస్టు పేర్కొంది.
భక్తుల నుంచి అందిన విరాళాలను నిర్వహించడంలో, కానుకలు లెక్కించడంలో ప్రామాణిక నిర్వహణ పద్ధతి (ఎస్‌వోపీ)ని అయోధ్య రామాలయం విషయంలో పాటించలేదని ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్) గుర్తించింది. ఎంత మొత్తాన్ని ఎలా పక్కదారి పట్టించారనే వివరాలపై దర్యాప్తు కొనసాగుతుండగా ఆలయంలో పలు తప్పుల్ని సిట్ ప్రాథమిక నివేదికలో ప్రస్తావించింది.
రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు పనుల్లో అధికారుల ప్రమేయం ఎంతమాత్రం వద్దని అయోధ్యకు చెందిన సాధువులు డిమాండ్ చేస్తున్నారు. అవినీతి నిలువెల్లా ఉండేది అధికార యంత్రాంగంలోనే అని, అందువల్ల బ్యూరోక్రసీ నుంచి ఎవరినీ ట్రస్టులో జోక్యం చేసుకోనివ్వరాదని అయోధ్యకు చెందిన మిథిలేశ్ నందిని శరణ్ అనే సాధువు విజ్ఞప్తి చేశారు. వేర్వేరు వర్గాలకు చెందిన సాధువుల ప్రాతినిధ్యం ఉండాలే గానీ వేరే ఏ అధికారిని సీఈవోగా నియమించినా తమ మనోభావాలు దెబ్బతింటాయని చెప్పారు. మతపరమైన వ్యవహారాల్లో అధికారుల ప్రమేయాన్ని అనుమతించేది లేదని మరో సాధువు మహంత్ ధరందాస్ తేల్చిచెప్పారు.





