
కృత్రిమ మేధ (ఏఐ), డేటా సైన్స్ వంటి ఆధునిక సాంకేతికతలు ప్రపంచాన్ని వేగంగా మార్చుతున్న ఈ కాలంలో, భారతీయ జ్ఞాన సంపదను, సృజనాత్మకతను ఎలా పరిరక్షించాలనే ప్రశ్న అత్యంత ప్రాధాన్యమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సవాలుకు భారతదేశంలోని విద్యాసంస్థలు వినూత్న పరిష్కారాలను చూపిస్తున్నాయని ఆయన ప్రశంసించారు.
తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, వేల ఏళ్ల చరిత్ర కలిగిన నలందా విశ్వవిద్యాలయం ఆధునిక రూపంలో భారత భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తోందని అన్నారు. రెండేళ్ల క్రితం నలందా నూతన ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం తనకు లభించిందని గుర్తుచేసిన ఆయన, అక్కడ తిరిగి ప్రారంభమైన శాస్త్రాధ్యయన సంప్రదాయం విశేషంగా ఆకట్టుకుందని చెప్పారు.
శాస్త్రాధ్యయనం అనేది కేవలం తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం మాత్రమే కాదని, వాద–సంవాదాలు, తర్కబద్ధమైన చర్చలు, వాస్తవాల ఆధారంగా జ్ఞానాన్ని పంచుకునే భారతీయ సంప్రదాయమని ప్రధాని వివరించారు. అదే సమయంలో ఇతరుల అభిప్రాయాలను ఓపికగా వినడం, వాటిని అర్థం చేసుకోవడం కూడా ఈ విధానంలో అంతర్భాగమని ఆయన పేర్కొన్నారు.
నలందా విశ్వవిద్యాలయం తన స్నాతకోత్సవంలో ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించడం అభినందనీయమని ప్రధాని అన్నారు. ముఖ్యంగా అక్కడ చదువుతున్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది విదేశాల నుంచి రావడం, భారతీయ జ్ఞాన వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణ పొందుతున్నదానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నలందా విశ్వవిద్యాలయాన్ని అభినందించిన ఆయన, దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.
అదే విధంగా, యువతను ఆధునిక సాంకేతికతకు సిద్ధం చేస్తూనే భారతీయ మూలాలతో అనుసంధానం చేసే మరో విశిష్ట కార్యక్రమాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఏఐ, డేటా సైన్స్‌లో బీటెక్ కోర్సును ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమం ఆధునిక సాంకేతికతను భారతీయ జ్ఞాన సంపదతో అనుసంధానించే చారిత్రక అడుగుగా ప్రధాని అభివర్ణించారు. దీనివల్ల భారతీయ భాషల కోసం కొత్త ఏఐ సాధనాల అభివృద్ధికి ఊతం లభిస్తుందని, అలాగే వేదాలు, శాస్త్రాలు, ప్రాచీన గ్రంథాలు, రాతప్రతులను డిజిటల్ రూపంలో భద్రపరిచే ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వినూత్న కార్యక్రమానికి కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం యాజమాన్యానికి, అధ్యాపకులకు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతీయ జ్ఞాన సంపదను ఆధునిక విజ్ఞానంతో మేళవించే ఇటువంటి ప్రయత్నాలే వికసిత్ భారత్ నిర్మాణానికి బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు.





