
34views
డాక్టర్ మన్మోహన్ వైద్య
2026 బెంగాల్ ఎన్నికల ఫలితాలు 1905 – 1911 మధ్య కాలంలో బెంగాల్ చూపించిన చైతన్యాన్ని, పట్టుదలను, జాతీయ భావాన్ని, తిరుగులేని పోరాటాన్ని గుర్తుచేస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచాయి, సంతోషపెట్టాయి. నేను 2025 డిసెంబర్, 2026 ఫిబ్రవరి నెలల్లో బెంగాల్ వెళ్ళినప్పుడు అక్కడి జనాలు మార్పును కోరుకున్నారు కానీ, అది నిజంగా సాధ్యమవుతుందని చాలా తక్కువ మంది నమ్మారు. అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే మార్పు రావడం ఒక అద్భుతం లాగే అనిపించింది. భయం లేని వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు వేసేలా చేయడం పెద్ద సవాలుగా నిలిచింది. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, భద్రతా దళాలు కలిసికట్టుగా శ్రమించి ఈ అద్భుతాన్ని సాధ్యం చేశాయి.
ఈసారి బెంగాల్ ప్రజలు మునుపెన్నడూ లేని విధంగా ఓట్లు వేశారు. గత ఐదు ఎన్నికల్లో (2001 నుండి 2021 వరకు) సగటు ఓటింగ్ 79.22 శాతం ఉంటే, ఈసారి అది ఏకంగా 92.47 శాతానికి పెరిగింది. ఈ 13 శాతం పెరుగుదలకు ఎస్.ఐ.ఆర్ (SIR) కృషి ఒక కారణం. భయం లేని వాతావరణం, ప్రజల్లో ఉన్న ఉత్సాహం వల్లనే ఇది సాధ్యమైంది. ప్రజలు ఈ ఎన్నికలను సంస్కృతిని కాపాడుకునే పోరాటంగా భావించారు. భద్రతా దళాలు బాధ్యతగా పని చేయడం వల్ల తమ ప్రజాస్వామ్య హక్కులపై జనాల్లో నమ్మకం పెరిగింది.
ఫిబ్రవరిలో కోల్‌కతాలో ఒక సీనియర్ వామపక్ష మహిళా జర్నలిస్టును కలిశాను. మే 29న ఆమెతో మళ్ళీ మాట్లాడాను. 18 ఏళ్ళ వయసులో ఆమె మొదటి ఓటు వేశారట, ఇప్పుడు 46 ఏళ్ళ వయసులో మళ్ళీ ఓటేశారు. మార్పు కావాలనే గట్టి కోరిక, ఆ మార్పు సాధ్యమే అనే నమ్మకమే ప్రజలను ఇంతలా ఓటింగ్ వైపు నడిపించాయి.
బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ హింస జరిగేది. కానీ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చొరవ వల్ల ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. ప్రజలు భయం లేకుండా బయటకు వచ్చి ఓటేశారు.
ఈ ఎన్నిక కేవలం బీజేపీ విజయం మాత్రమే కాదు. బెంగాల్ ప్రజలు భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని, హిందుత్వ ఆలోచనను గెలిపించారు. బెంగాల్ ఆత్మ మళ్ళీ మేల్కొన్నట్లు అనిపిస్తోంది. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, శ్రీ అరవిందో, బంకిం చంద్ర ఛటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, జగదీష్ చంద్ర బోస్, బిపిన్ చంద్ర పాల్ లాంటి ఎందరో మహానుభావులు చూపిన ఆధ్యాత్మిక, జాతీయ చైతన్యానికి దక్కిన విజయమిది.

ఈ విజయం 1905 నాటి బెంగాల్ విభజన వ్యతిరేక పోరాటాన్ని గుర్తుచేస్తోంది. ఆ రోజుల్లో “వందేమాతరం” నినాదంతో బెంగాల్ అపూర్వమైన ఐక్యతను, జాతీయ భావాన్ని చాటింది. ఆ ఉధృతిని తట్టుకోలేక బ్రిటిష్ ప్రభుత్వం 1911లో బెంగాల్ విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అంతేకాదు, తమ రాజధానిని కోల్‌కతా నుండి ఢిల్లీకి మార్చాల్సి వచ్చింది. ఆ కోణంలో చూస్తే, ఈ ఎన్నికల్లో భారతీయ ఆధ్యాత్మిక భావన సాధించిన విజయం బెంగాల్ సాధించిన “వందేమాతరం క్షణం” లాంటిదే.
1875లో బంకిం చంద్ర ఛటర్జీ ‘ఆనందమఠ్’ నవల కోసం “వందేమాతరం” పాట రాశారు. 1896 కాంగ్రెస్ సదస్సులో రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని మొదటిసారి పాడారు. 1905 బెంగాల్ విభజన సమయంలో ప్రజలు ఈ పాటను స్వాతంత్ర్య పోరాట మంత్రంగా మార్చుకున్నారు.
విభజనకు వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకమైంది. లాల్-బాల్-పాల్ (లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్) నాయకులుగా నిలిచారు. వందేమాతరం నినాదం ప్రజల్లో కొత్త శక్తిని నింపింది. ఎంతో మంది విప్లవకారులు నవ్వుతూ ఉరికొయ్యలను ముద్దాడారు.
1905 అక్టోబర్ 16 ఆదివారం నాడు కోల్‌కతాలో జరిగిన రక్షాబంధన్ వేడుకలు చరిత్రలో నిలిచిపోయాయి. సాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పండుగను, ఆ రోజు బెంగాల్ విభజనకు నిరసనగా జరుపుకున్నారు. హిందూ ముస్లింలు గంగలో స్నానం చేసి, ఒకరికొకరు రాఖీలు కట్టుకుంటూ “ఈ దారం మనల్ని కలిపి ఉంచినట్లే, బెంగాల్‌ను ఎప్పటికీ విడిపోనివ్వం” అని ప్రతిజ్ఞ చేశారు.
శ్రీ అరబిందో వందేమాతర గీతాన్ని స్వేచ్ఛా మంత్రం అని పిలిచారు. జాతీయ చైతన్యం కోసం ఆయన “వందేమాతరం” అనే వారపత్రికను కూడా నడిపారు. 1907లో మేడం భికాజీ కామా జర్మనీలో ఎగరవేసిన భారత జెండాపై “వందేమాతరం” అని రాసి ఉంది. విప్లవకారులకు ఇది ఒక దేశభక్తి ప్రేరణగా మారింది.
ఈ విప్లవ జ్వాలను చూసి భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం 1906 ఏప్రిల్‌లో ఈ పాటపై నిషేధం విధించింది. అయినా జనాలు తగ్గలేదు. చివరకు బ్రిటీషర్లు తలవంచాల్సి వచ్చింది. ఈ చైతన్యం బెంగాల్‌కే పరిమితం కాలేదు, దేశమంతటా వ్యాపించింది. నాగపూర్‌లో పదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే హెడ్గేవార్ (ఆర్ఎస్ఎస్ స్థాపకులు) పాఠశాలలో “వందేమాతరం” అని నినదించి, స్కూల్ నుండి బహిష్కరణకు గురయ్యారు.

కాంగ్రెస్ వార్షిక సమావేశాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్, విష్ణు దిగంబర్ పలుస్కర్, ఓంకార్‌నాథ్ ఠాకూర్ లాంటి సంగీత విద్వాంసులు ఈ పాటను పాడేవారు. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా కాంగ్రెస్ నాయకులు దీనిని స్వాతంత్ర్య పోరాట శ్వాసగా భావించారు.
కానీ 1921 తర్వాత బ్రిటిష్ కుటిల రాజకీయాల వల్ల కాంగ్రెస్‌లో కొన్ని మతపరమైన శక్తులు పెరిగాయి. ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇస్తూ, వందేమాతరం పాటను మతపరమైనదిగా ముద్ర వేయడం మొదలుపెట్టారు. 1920 వరకు జీవనాడిగా ఉన్న పాటను 1923 తర్వాత కొందరు వ్యతిరేకించారు. అక్కడి నుండే దేశ విభజన బీజాలు పడ్డాయని అంటారు.
భారతీయ ఆలోచనా విధానంలో మనిషి అంటే కేవలం శరీరం మాత్రమే కాదు, శరీరం, ప్రాణం, మనస్సు, బుద్ధి, ఆత్మ అనే ఐదు పొరల కలయిక. వందేమాతరం పాట కూడా భారతదేశ సంపూర్ణ రూపాన్ని ఇలాగే చూపిస్తుంది. మొదటి చరణం దేశ భూభాగాన్ని, రెండో చరణం ప్రజలను, మిగిలిన చరణాలు దేశ మనస్సును, బుద్ధిని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని వివరిస్తాయి.
పాటలోని “తుమి విద్యా, తుమి ధర్మ” అనే మాటల్లో.. ‘విద్య’ అంటే ముక్తిని ప్రసాదించే ఆధ్యాత్మిక జ్ఞానం. ‘ధర్మం’ అంటే మతం కాదు.. స్వార్థాన్ని వీడి, సమాజం కోసం బతకడం, సమాజానికి తిరిగి ఇవ్వడం.
సోదరి నివేదిత అన్నట్లుగా, ప్రజలు తమ శ్రమ ఫలితాన్ని సమాజానికి తిరిగి ఇచ్చినప్పుడు ఆ సమాజం సంపన్నమవుతుంది. దేశ నాయకత్వం కూడా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత లోక్‌సభకు “ధర్మచక్ర ప్రవర్తనాయ”, రాజ్యసభకు “సత్యం వద, ధర్మం చర”, సుప్రీంకోర్టుకు “యతో ధర్మస్తతో జయః” అనే ఆదర్శాలను ఎంచుకుంది, జాతీయ జెండాలో ధర్మచక్రాన్ని చేర్చింది. ఈ విద్య, ధర్మం భారతీయుల గుండెల్లో ఉన్నాయి.
భారతమాత అంటే శక్తి స్వరూపిణి దుర్గ, ఐశ్వర్య ప్రదాత లక్ష్మి, జ్ఞాన స్వరూపిణి సరస్వతి కలయిక. సంపూర్ణ వందేమాతరం పాట పాడటానికి మూడు నిమిషాలు పడుతుంది. ఇందులో మతతత్వం ఎక్కడుంది?
బ్రిటిష్ కాలంలో దేశాన్ని విడదీయాలని చూసిన శక్తులు, నేడు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులు మాత్రమే ఈ పాటలో మతతత్వాన్ని చూస్తున్నాయి. ఇది భారతీయ సంస్కృతిపై వారికున్న అజ్ఞానాన్ని చూపిస్తుంది. ఈ మధ్య కాలంలో భారత ప్రభుత్వం సంపూర్ణ వందేమాతరం పాడటాన్ని ప్రోత్సహించడం అభినందనీయం.
2026 బెంగాల్ ఎన్నికల ఫలితాలు పాత చైతన్యాన్ని గుర్తుచేస్తున్నాయి. కేవలం భాషా గుర్తింపు ఆధారంగా బెంగాల్‌ను విడదీయాలని చూసిన ప్రయత్నాలను ఈ ఎన్నికలు తిప్పికొట్టాయి. బెంగాలీ భాష ప్రత్యేకమైనదే అయినా, అది భారతదేశ ఆధ్యాత్మిక గుర్తింపులో ఒక భాగం.
1905లో బ్రిటీషర్లు, తీవ్రవాదులు కలిసి దేశాన్ని దెబ్బతీయాలని చూస్తే, 2026లో కొందరు రాజకీయ నాయకులు, మతోన్మాదులు, కల్చరల్ మార్క్సిస్టులు కలిసి బెంగాల్‌ను మిగతా భారతదేశం నుండి వేరు చేయాలని చూశారు. రెండు సందర్భాల్లోనూ బెంగాల్ హిందువుల ఉనికి ప్రమాదంలో పడింది. కానీ ఇప్పుడు వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్ చూపిన బెంగాల్ ఆత్మ మళ్ళీ మేల్కొంది. భారతీయ సనాతన జీవన విధానం, హిందుత్వం మళ్ళీ గెలిచాయి.
ఈ చారిత్రాత్మక మార్పును సాధ్యం చేసిన ఎన్నికల అధికారులకు, భయం లేకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేసిన బెంగాల్ మహిళలకు, పురుషులకు అభినందనలు. ప్రజాస్వామ్యంపై వారికున్న నమ్మకమే ఈ విజయాన్ని అందించింది. ఇది నిజంగా బెంగాల్ సాధించిన “వందేమాతరం క్షణం”.





