News

ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ఆరోగ్య అభ్యాస వర్గం నిర్వహణ

6views

ఆరోగ్య భారతి నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాలలో ఆరోగ్య అభ్యాస వర్గం (హెల్త్ ట్రైనింగ్ ప్రోగ్రామ్) నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణ, జీవనశైలి మార్పులు, అత్యవసర వైద్య సహాయం వంటి అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించారు.

నంద్యాల నగరం, నంద్యాల గ్రామీణ ప్రాంతం, ఆత్మకూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, చాగలమర్రి ప్రాంతాల నుంచి ఆరోగ్య భారతి కార్యకర్తలు విశేషంగా హాజరయ్యారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలను అందించారు.

బొమ్మలసత్రంలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి ఆంధ్ర ప్రాంత అధ్యక్షుడు డా. పి.ఎస్. రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్)పై అవగాహనతో పాటు ప్రాయోగిక శిక్షణ అందించారు. అలాగే గుండెపోటు మరియు గుండె ఆగిపోవడం మధ్య ఉన్న తేడాలను వివరించారు.

ప్రధాన వక్తలుగా పాల్గొన్న డాక్టర్ గీత మహిళల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా స్త్రీ వ్యాధుల సమయంలో తీసుకోవాల్సిన పోషకాహారం గురించి వివరించారు. డాక్టర్ ఎస్. బాల వెంకటకృష్ణ (ఎం.డి., ఆయుర్వేదం) ఆయుర్వేద దృష్టిలో గుండె జబ్బులు, వాటి చికిత్సా విధానాలు, ఆహార నియంత్రణ ప్రాధాన్యాన్ని వివరించారు. చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ మధుసూదన్ రెడ్డి వేసవి కాలంలో చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో ఆరోగ్య భారతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పరమేశ్వర రెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీ చెన్నకేశవులు, సహ కార్యదర్శి శ్రీ విజయభాస్కర్ రెడ్డి, నగర కార్యదర్శి డాక్టర్ నరహరి (బి.హెచ్.ఎం.ఎస్.) తదితరులు పాల్గొన్నారు. దాదాపు 60 మంది కార్యకర్తలు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రయోజనం పొందారు.

సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమంతో ప్రారంభమైన ఈ శిక్షణ వర్గం, విందుతో ముగిసింది.