నేల ఆరోగ్యాన్ని కాపాడటంలో సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట, జీవన ఎరువుల ప్రాముఖ్యతను ప్రతి రైతు అవగాహన చేసుకోవాలని రైతు శిక్షణా శ్రీకాకుళం జిల్లా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఆర్. శ్రీనివాసరావు అన్నారు.
రణస్థలం మండలం తెప్పలవలస గ్రామంలో ‘ఖేతి బచావ్’ కార్యక్రమంలో భాగంగా రైతులకు శిక్షణ, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి, మొక్కజొన్న, కొబ్బరి, ఆయిల్ పామ్ వంటి పంటల్లో మేలైన యాజమాన్య పద్ధతులను వివరించారు.
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్న పీఎండీఎస్ కిట్లను రైతులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అలాగే డ్రోన్ సాంకేతికత ద్వారా నానో ఎరువుల స్ప్రేయింగ్ చేయడం వల్ల ఖర్చు తగ్గి, దిగుబడులు మెరుగవుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు జి.ఎస్. రాయ్, కె. హరికుమార్, బి. జ్యోతిబసు, వ్యవసాయ అధికారులు వై. సురేష్, విజయభాస్కర్ తదితరులు పాల్గొని రైతులకు పలు సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు.
సేంద్రియ పద్ధతులను విస్తృతంగా అనుసరించడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు దీర్ఘకాలికంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకోవచ్చని అధికారులు సూచించారు.





