
మహాభారతంలోని స్త్రీ పాత్రల్లో గాంధారి అత్యంత సంక్లిష్టమైన, గౌరవప్రదమైన పాత్ర. ఆమె జీవితం ఒక ధర్మయజ్ఞంగా సాగింది. కర్తవ్య నిర్వహణలో వ్యక్తిగత సుఖాలను త్యాగం చేసిందామె. కళ్లకు గంతలు కట్టుకున్నా, ధర్మాధర్మాలను అంతర్నేత్రంతో చూడగలిగింది. అధికారం కంటే ధర్మం, మమకారం కంటే నీతి గొప్పవని చాటింది.
గాంధారికి వివాహానికి ముందే తన భర్త అంధుడని తెలిసినా.. అంధత్వం వల్ల ఆయన అనుభవిస్తున్న లోటును తాను కూడా పంచుకోవాలని నిర్ణయించుకుంది. పతి అనుభవించని సౌఖ్యం తనకు వద్దనుకున్న ఆమె నిర్ణయం నిజంగా అపూర్వం. భర్త పట్ల గౌరవంతో తన కళ్లకు గంతలు కట్టుకుని ఆయన అడుగుజాడల్లో నడిచింది. భర్తకు సేవ చేయడమే జీవిత పరమావధిగా భావించింది. ఆమెకి కుటుంబం పట్ల ఎంత శ్రద్ధాభక్తులు ఉన్నాయో ధర్మం పట్ల కూడా అంతే భక్తిశ్రద్ధలున్నాయి.
గాంధారిలో పుత్ర వాత్సల్యం కూడా మెండుగా ఉంది. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు దుర్యోధనుడు తల్లి వద్దకు వచ్చి.. ఆశీర్వచనం కోరినప్పుడు- ఆమె సాధారణ అమ్మలా ‘నీకు విజయం కలుగుగాక’ అని దీవించలేదు. ‘న పుత్ర విజయే యత్నః కార్యస్తే ధర్మమాశ్రయ యతో ధర్మస్తతో జయః.. విజయం కోసం అధర్మాన్ని ఆశ్రయించకు. ధర్మబద్ధంగా నడుచుకో. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది’- అని ఆశీర్వదించింది. కన్నకొడుకు కళ్లముందే ఓడిపోతాడని తెలిసినా, ధర్మం వైపే నిలబడటం.. ఆమె ఔన్నత్యాన్ని సూచిస్తుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక.. తన పుత్రులందరూ మరణించారన్న వార్త ఆమెను కుదిపేసింది. ఆ మారణహోమానికి కారణమని భావించి శ్రీకృష్ణుణ్ణి- ‘కురువంశం ఎలాగైతే నశించిందో, అలాగే నీ యాదవ వంశం కూడా కలహాలూ కల్లోలాలతో నశించిపోవుగాక!’ అంటూ శపించింది. భగవంతుణ్ణి సైతం శపించగలిగే శక్తి ఇంద్రియ నిగ్రహం పాటించడం ద్వారా లభించింది గాంధారికి.
శ్రీకృష్ణుడు ఆగ్రహించలేదు. నవ్వుతూ ఆ శాపాన్ని స్వీకరించాడు, ఎందుకంటే అది ఒక మహాసాధ్వి వాక్కు కాబట్టి!
గాంధారి తన కళ్లకు కట్టుకున్న గంతలను ఒక్కసారి విప్పి, తన చూపులోని శక్తితో పుత్రుణ్ణి రక్షించాలని తపించింది. అది కన్నతీపి వల్ల కలిగే ఆవేదన. భీమునితో గదా యుద్ధానికి ముందు ఆమె తన దృష్టితో దుర్యోధనుడి శరీరాన్ని వజ్ర సమానం చేసింది. కానీ శ్రీకృష్ణుడి మాయ వల్ల తొడల భాగం మినహాయింపు అయ్యింది..
గాంధారి ధృతరాష్ట్రుని భార్యగానే కాకుండా, స్వతంత్ర ఆలోచనాపరురాలిగా కనిపిస్తుంది. ఆమె జీవితం మనకు రెండు విషయాలను బోధిస్తుంది. మొదటిది ఆత్మనిగ్రహం. కళ్లకు గంతలు కట్టుకోవడం ద్వారా బాహ్య విషయాల కంటే ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వడం కనిపిస్తుంది. రెండోది నిష్పక్షపాతం. సొంత బిడ్డలైనా సరే, తప్పు చేస్తే సమర్థించకుండా అది తప్పని గట్టిగా చెప్పగలిగే ధైర్యం.
గాంధారి పాత్ర సహనానికి, ధర్మానికి సంకేతం. పతిభక్తిని, పుత్రప్రేమను, ధర్మనిష్ఠను సమన్వయం చేసుకున్న అరుదైన మూర్తిమత్వం గాంధారిది. తన కళ్లకు గంతలు కట్టుకుని చీకటిని స్వీకరించినా, ప్రపంచానికి ధర్మం అనే వెలుగును ప్రసాదించిన మహోన్నత శిఖరం ఆమె! అందుకే ఆమె చరిత సువర్ణాక్షరాలతో లిఖితమై ఉంటుంది.




