News

దేవాలయాలు సున్నితమైన అంశాలు

30views

దేవాలయాలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసేటప్పుడు ఇన్‌ఫ్లూయెన్సర్లు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు సూచించారు.క్షేత్రానికి సంబంధించిన ప్రతి అంశం భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుందని, అందువల్ల పోస్టులు, వీడియోలు ప్రచురించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు.

సోమవారం కొండపైన ఉన్న పద్మాలయ కల్యాణ మండపంలో ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌కు చెందిన ఇన్‌ఫ్లూయెన్సర్లతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈఓ త్రినాధరావు మాట్లాడారు.

ద్వారకాతిరుమల క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, స్వామివారి సేవలు, దేవస్థానం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను భక్తులకు చేరవేయడంలో సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. ఆలయ అభివృద్ధికి ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ వంతు సహకారం అందించాలని కోరారు.దేవస్థానం అందిస్తున్న ఆన్‌లైన్ సేవలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ముఖ్యంగా “మన మిత్ర” యాప్ వినియోగంపై భక్తులకు అవగాహన కల్పించాలని సూచించారు.

దేవాలయాలకు సంబంధించిన కవరేజ్ నిర్దిష్ట పరిమితులకు లోబడి ఉండాలని ఈఓ స్పష్టం చేశారు. ఆలయ ప్రాంగణంలో అనుమతి లేకుండా వీడియోలు చిత్రీకరించరాదని, డ్రోన్ కవరేజ్ కూడా దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో మాత్రమే జరగాలని తెలిపారు.

ఇన్‌ఫ్లూయెన్సర్లకు అవసరమైన సమాచారం, సహకారం అందించేందుకు దేవస్థానం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

సమావేశం అనంతరం శ్రీగోమాత ప్రొడక్ట్స్‌ ఆధ్వర్యంలో సమకూర్చిన శ్రీవారి జ్ఞాపికలను ఈఓ వేండ్ర త్రినాధరావు ఇన్‌ఫ్లూయెన్సర్లకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ డీవీ భాస్కర్‌, డీఈవో వై. భద్రాజీ, ఏఈఓలు ఎం. దుర్గారావు, పి. నటరాజారావు, వాసు, లక్ష్మీపతి, సూపరింటెండెంట్లు, ఏఈలు పాల్గొన్నారు. ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, ఏలూరు, దెందులూరు, భీమడోలు, విజయవాడ, భద్రాచలం, అత్తిలి, కామవరపుకోట, దూబచర్ల, అయినవెల్లి తదితర ప్రాంతాలకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు హాజరయ్యారు.