News

టీసీఎస్ నాసిక్ వివాదంలో వెలుగులోకి వచ్చిన మాజీ ఎంపీ ఇంతియాజ్ జీలీల్ పేరు

28views

టీసీఎస్ నాసిక్ శాఖలో జరిగిన లైంగిక దోపిడీ, మతమార్పిడి ఆరోపణల కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో మాజీ ఎంపీ, ఏఐఎంఐఎం (AIMIM) నాయకుడు ఇంతియాజ్ జలీల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నిదా ఖాన్‌కు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలపై ఏఐఎంఐఎం కార్పొరేటర్ మతిన్ పటేల్‌ను పోలీసులు విచారించారు. ఆ క్రమంలో క్రైమ్ బ్రాంచ్ అడిగిన ప్రశ్నలకు పటేల్ సమాధానమిస్తూ, పదేపదే “మీరు ఇంతియాజ్ జలీల్ సాహెబ్‌ను అడగాలి” అని బదులివ్వడంతో జలీల్ పేరు తెరపైకి వచ్చింది. నిందితులకు సంబంధించిన లింకులపై స్పష్టత కోసం సిట్ అధికారులు త్వరలోనే జలీల్‌ను కూడా విచారణకు పిలిపించే అవకాశం ఉంది.

ఆస్తుల కూల్చివేత – రాజకీయ వివాదం
పరారీలో ఉన్న నిందితురాలికి ఆశ్రయం ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో, కార్పొరేటర్ మతిన్ పటేల్‌కు చెందిన అక్రమ కట్టడాలను ఛత్రపతి సంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. ఈ చర్య రాజకీయ వివాదానికి దారితీసింది. మతిన్ పటేల్‌ను సమర్థిస్తూ ఇంతియాజ్ జలీల్ మాట్లాడారు. పటేల్ తప్పు చేసి ఉంటే దానికి ఆయన కుటుంబ సభ్యులను, వృద్ధ తల్లిదండ్రులను బాధ్యులను చేస్తూ ఉదయాన్నే ఇళ్లను కూల్చివేయడం సరికాదని జలీల్ ప్రశ్నించారు. కాగా, నాసిక్ పోలీస్ సిట్ ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి నమోదైన తొమ్మిది వేర్వేరు కేసులపై లోతైన దర్యాప్తును కొనసాగిస్తోంది.