
వేసవి తాపానానికి చెరువలు, కుంటలు, డ్యామ్‌లు సైతం ఎండిపోతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఓ అద్భుతమైన దృశ్యం వెలుగుచూసింది. భోర్ ప్రాంతంలోని చారిత్రక భాట్‌ఘర్ డ్యామ్ నీటిమట్టం వేగంగా పడిపోవడంతో.. ఏడాది పొడవునా నీటిలో మునిగి ఉండే పురాతన కాంబరేశ్వర ఆలయం పూర్తిగా బయటపడింది. పాండవుల కాలం నాటిదిగా భావిస్తున్న ఈ పురాతన శివాలయాన్ని చూసేందుకు స్థానిక భక్తులు, చరిత్ర ప్రేమికులు, పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.
అయితే, వేల్వండి నదిపై 1928లో బ్రిటిష్ ప్రభుత్వం లాయిడ్ డ్యామ్ నిర్మించిన సమయంలో ఈ చారిత్రక ఆలయం పూర్తిగా నీటి మునిగిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది మే నెల చివరలో డ్యామ్‌లో నీటి నిల్వలు7 శాతం కంటే తక్కువగా పడిపోయినప్పుడు మాత్రమే ఈ ఆలయం నీటిపైకి వస్తుంది. ఈ ఏడాది కూడా నీరు తగ్గడంతో గత వారం రోజులుగా ఈ ఆలయం క్రమంగా బయటపడుతూ వస్తోంది. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఆలయ గర్భగుడి ఎప్పుడూ మోకాళ్ల లోతు నీటితో నిండి ఉంటుంది. చుట్టూ ఉన్న గోడలను పెద్ద పెద్ద ఆయతాకార రాళ్లతో నిర్మించగా.. పైభాగంలోని గోపురాన్ని ఇటుకలు, ఇసుక, సున్నం మిశ్రమంతో అద్భుతంగా చెక్కారు. వందలాది ఏళ్లుగా నీటిలోనే ఉంటూ, నీటి ఒత్తిడిని తట్టుకుంటూ వస్తున్నా.. ఈ ఆలయ కట్టడం ఇప్పటికీ చెక్కుచెదరకుండా పటిష్టంగా ఉండటం విశేషం.




