News

సనాతన ధర్మంలోకి మారిన ప్రొఫెసర్ దరఖాస్తు తిరస్కరణపై అలహాబాద్ హైకోర్టు అసంతృప్తి

27views

ఒక ముస్లిం ప్రొఫెసర్ స్వచ్ఛందంగా సనాతన ధర్మాన్ని స్వీకరించి చేసిన మత మార్పిడి గుర్తింపు దరఖాస్తును తిరస్కరించిన అంశంపై తీవ్ర అసంతృప్తి  అలహాబాద్ హైకోర్టు  వ్యక్తం చేసింది.

అనిల్ పండిట్ (పూర్వం మహమ్మద్ అహ్సాన్) అనే యువ ప్రొఫెసర్ స్వచ్ఛందంగా సనాతన ధర్మంలోకి మారిన అనంతరం, ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడుల నిషేధ చట్టం–2021 కింద అధికారిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ దరఖాస్తుపై నిర్ణయం తీసుకునే ముందు ప్రయాగ్‌రాజ్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ పలుమార్లు పోలీసు విచారణకు ఆదేశించి, అనంతరం దరఖాస్తును తిరస్కరించారు.

ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన జస్టిస్ అజిత్ కుమార్ మరియు ఇంద్రజిత్ శుక్లాలతో కూడిన డివిజన్ బెంచ్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వుపై తాత్కాలిక స్టే విధించింది.

అనిల్ పండిట్ 2022లో ఆర్య సమాజ్ ఆలయంలో సనాతన ధర్మాన్ని స్వీకరించిన అనంతరం తన పేరును మార్చుకున్నారు. చిన్ననాటి నుంచే హిందూ సంస్కృతి, సనాతన సంప్రదాయాల పట్ల ఆకర్షణ ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. తమ కుటుంబంలో నమాజ్ ఆచరణ ఎప్పుడూ లేదని కూడా పేర్కొన్నారు.

అలహాబాద్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చదువుతున్న సమయంలో ఆయన అపర్ణా వాజ్‌పేయిని కలిశారని, అనంతరం పరస్పర సమ్మతితో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారని వెల్లడైంది. ప్రస్తుతం ఏడు నెలల గర్భవతిగా ఉన్న అపర్ణా వాజ్‌పేయి, తాను స్వేచ్ఛా సంకల్పంతోనే ఈ వివాహం చేసుకున్నానని కోర్టుకు తెలిపింది.

అపర్ణా తండ్రి వివాహాన్ని వ్యతిరేకిస్తూ అనిల్ పండిట్‌పై క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేసినప్పటికీ, దర్యాప్తులో పిటిషనర్ ఎలాంటి బలవంతపు మత మార్పిడి లేదా ఒత్తిడి చేయలేదని పోలీసులు కోర్టుకు నివేదించారు.

ఈ కేసు నేపథ్యంలో, స్వచ్ఛందంగా సనాతన ధర్మాన్ని స్వీకరించే వ్యక్తుల హక్కులను పరిరక్షించాల్సిన అవసరాన్ని హిందూ సంఘాలు ప్రస్తావిస్తున్నాయి.