హలాలా పేరుతో వివాహితపై లైంగిక దాడి ఆరోపణలు: భర్త కుటుంబంపై కేసు నమోదు

ఆగ్రాలో ఒక వివాహిత ముస్లిం మహిళ తన భర్త కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ట్రిపుల్ తలాక్ అనంతరం “హలాలా” పేరుతో తన మామ, బావలు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి వివరాల ప్రకారం, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వివాహం జరిగినప్పటి నుంచి అత్తమామలు అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపింది. కోటి రూపాయల కట్నంతో పాటు విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్ కారు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించింది.
ఈ డిమాండ్లు నెరవేర్చలేదన్న కారణంతో మే 11న తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పినట్లు బాధితురాలు వెల్లడించింది. అనంతరం మళ్లీ తనతో కాపురం చేయాలంటే “హలాలా” ప్రక్రియకు లోనవ్వాలని భర్త చెప్పాడని పేర్కొంది.
దీనికి కొనసాగింపుగా తన మామ, బావ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, తాను ప్రతిఘటించగా భర్తతో పాటు అత్తమామలు తనపై దాడి చేశారని ఆమె ఆరోపించింది.
బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను రక్షించారు. మహిళ ఫిర్యాదు మేరకు భర్త, మామ, అత్త, బావ, ఆడపడుచుపై కేసు నమోదు చేసినట్లు మంటోలా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, బాధితురాలి కుటుంబ సభ్యులు తమ ఇంట్లోకి చొరబడి దాడి చేశారని భర్త కూడా ప్రతివాద ఆరోపణలు చేసినట్లు సమాచారం. పోలీసులు ఇరు వర్గాల ఆరోపణలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై మహిళా హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, హలాలా వంటి ఆచారాల పేరుతో మహిళలపై జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.




