News

తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయాలు : టీటీడీ ఈవో

29views

శ్రీవారి దర్శనార్థం తిరుమల, తిరుపతికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయాలు కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిరోజూ వేలాదిగా వచ్చే భక్తులకు ప్రస్తుత వసతి సదుపాయాలు సరిపోవడం లేదని, వాటిని విస్తరించేందుకు సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు.

ముఖ్యంగా తిరుపతిలో వసతి సదుపాయాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో మాడవీధులు, ఆలయ పరిసరాలు, ముఖ్య ప్రదేశాల్లో నిరంతరం నీటి పిచికారీ చేయాలని ఆదేశించారు. భక్తుల నుండి అభిప్రాయాలు సేకరించి, వాటి ఆధారంగా సేవలను మరింత మెరుగుపరచాలని చెప్పారు. అన్ని ఆలయాల్లో క్యూఆర్ కోడ్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు.

తిరుమలలో నెయ్యి నిల్వ ట్యాంకులు, ముడి సరుకుల గోదాముల సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త గోదాములు నిర్మించాలని, పెండింగ్ వ్యర్థాలను త్వరగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిఏసి-1, ఆస్థాన మండపాలను ఆధునికీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు.