
హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్లను తూలనాడి, నానా మాటలు అన్న తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కి హఠాత్తుగా దేవుడు గుర్తొచ్చాడు. అది కూడా ఎన్నికల సమయంలో. ఇంకేముంది మందీ మార్బలంతో హఠాత్తుగా దేవాలయాల దర్శనం చేసుకున్నాడు. మహా భక్తుని లాగా భస్మాలు పెట్టుకుంటూ.. నానా హంగామా చేశారు. అర్చకులతో సంభాషణలు చేస్తూ.. హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా వైరరల్ అయ్యాయి.
అయితే.. దీనిపై అప్పటికే అనేక విమర్శలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదంతా కేవలం ఎన్నికల స్టంట్ అని హిందువులు, భక్తులు, జాతీయవాదులు తేల్చి చెప్పేశారు. అయితే… ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కి సంబంధించి, మరో వివాదాస్పద వీడియో వెలుగులోకి వచ్చింది.
ఓ ఆలయంలో అర్చకుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కి పవిత్రమైన భస్మాన్ని పూస్తే… ఉదయనిధి వెంటనే దానిని తన తువ్వాలుతో తుడిచేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఆయనకు హిందూ ధర్మం, విశ్వాసాల పట్ల చిత్తశుద్ధి ఎలా వుందో ఊహించుకోవచ్చు.
అచ్చు ఇలాంటి వ్యవహారమే మరో చోట కూడా జరిగింది. ఓ దేవాలయానికి వెళ్లినప్పుడు అక్కడి అర్చకుడు ఉదయనిధి స్టాలిన్ నుదటిన కుంకుమ పెట్టారు. ఆలయ ప్రాంగణం నుంచి బయటపడగానే… వెంటనే ఆ కుంకుమను తుడిచేశారు. బయటికి వచ్చే సమయానికి హిందూ చిహ్నాలేవీ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు.
తమిళనాడులో ఎన్నికల సందర్భంగా సనాతన ధర్మాన్ని, హిందూ దేవాలయాలు, ఆచారాలను, సంస్కృతిని వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు మాత్రం పండితులు సూచించిన శుభ సమయాల్లో దేవాలయాలను సందర్శించడం, నామినేషన్లను దాఖలు చేయడం తరుచుగా కనిపిస్తుంది. ఇది ఎన్నికల వ్యూహమని కూడా తేలిపోతోంది. అంతేకాకుండా జ్యోతిష్కులను సంప్రదిస్తూ, హోమాలు కూడా ఇదే రాజకీయ నేతలు చేయడం మనకు కనిపిస్తుంది. అభ్యర్థులు తరచుగా టిక్కెట్ల కేటాయింపు, గెలుపు అవకాశాలు, అనుకూల సమయాల గురించి సలహాలు కోరతారని జ్యోతిష్యులు పేర్కొన్నారు.





