ArticlesNews

ఉపవాసం

61views

సోమవారం నుంచి శనివారం వరకూ ఏదో ఒకరోజు తమ ఇష్టదైవం పేరుతో ఉపవాసం ఉంటూ ఉంటారు చాలామంది. రోజంతా ఖాళీ కడుపుతోనో, కేవలం అల్పాహారం తీసుకునో ఉండిపోయి రాత్రికి మాత్రమే భోజనం చేస్తారు. ఇంకొందరు రాత్రిపూట అన్నం తినడం మానేస్తారు. ‘ఉపవాసం’ అంటే ఆహారం తీసుకోకుండా ఉండటం అనే భావన సమాజంలో బలంగా స్థిరపడిపోయింది. కానీ శాస్త్రాల ప్రకారం ఉపవాసానికి అసలు అర్థం ఎంతో లోతైనది, ఆధ్యాత్మికమైనది.

‘ఉప’ అంటే దగ్గరగా, ‘వాసం’ అంటే నివసించడం. ‘ఉపవాసం’ అనేది పరమాత్మకు దగ్గరగా ఉండటం, ఆయన సన్నిధిలో మనసును నిలుపుకోవడం. కాబట్టి ఉపవాసం తాలూకు మర్మం కేవలం తిండి మానేయడంలో కాకుండా, మనసును దైవస్మరణలో నిలిపి ఉంచడంలో ఉంది. భగవంతుడికి చేరువగా ఉండేందుకు ప్రయత్నించడమే ఉపవాసదీక్ష అసలైన ఉద్దేశం. ఉపవాసం ఉన్న రోజున చేసే ప్రతి క్రియ – ధ్యానం, నామస్మరణం, పూజ, పఠనం, సత్సంగం, సేవ- ఇవన్నీ ఆత్మను పరమాత్మ వైపు నడిపించే మార్గాలు. ఇవి భౌతిక ఆసక్తులను తగ్గించి, అంతరాత్మను శుద్ధిచేస్తాయి. దేవుడికి దగ్గరగా ఉండటం అనేది- ఆత్మను పరమాత్మలో కలపడమనే సాధనలో భాగం. దీని ద్వారా మనిషి క్రమంగా బాహ్య ప్రపంచపు మమకారాలను వదిలి, ‘ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే’ అనే తత్వాన్ని గ్రహించే స్థితికి చేరుకుంటాడు. బట్టలు, వస్తువులు, తిండి, నిద్ర, ఆస్తులు… ఇవన్నీ తాత్కాలికమని తెలిసి, వాటిపట్ల ఆసక్తి తగ్గి, పరమాత్మపైనే ప్రేమ, భక్తి మిగిలే స్థితి – అదే మోక్షస్థితి. అందువల్ల ఉపవాసం కూడా మోక్షస్థితిని చేరుకోవడానికి ఒక సాధనమే.

తిండి మానేయడం, జాగారం చేయడం లేదా తక్కువ సమయం నిద్రించడం లాంటివి ఉపవాసంలో సహాయక నియమాలు మాత్రమే- అంతేకానీ ప్రధాన ఉద్దేశాలు కావు. ఇంద్రియాలను నియంత్రించి, భోగాసక్తిని తగ్గించి, ఆత్మను పరమాత్మ వైపు మళ్లించడం- ఇదే ఉపవాసదీక్షకు ఆయువు పట్టు వంటిది. ఈ ప్రక్రియలో శరీరానికి, ఇంద్రియాలకు పగ్గాలు వేయాలి. అధిక ఆహారం, నిద్ర ధ్యానానికి అడ్డుగా నిలుస్తాయి. అందుకే ఉపవాసదినంలో తక్కువ ఆహారం తీసుకోవడం, నిద్రను నియంత్రించుకోవడం వంటి నియమాలు ప్రవేశించాయి. ఇవి శరీరాన్ని శాంతంగా ఉంచి, మనసును దేవుడి మీద కేంద్రీకరించడానికి సహాయపడతాయి.

రోజంతా దైవస్మరణలో ఉంటూ, శరీరానికి అవసరమైనంత మాత్రమే ఆహారం తీసుకోవడం కూడా నిజమైన ఉపవాసమే. కానీ పేరుకు తిండి మానేసి వేరే పనుల్లో మునిగిపోవడం, మాటలతో లేదా వినోదాలతో సమయం గడపడం- ఇవి ఉపవాస ఫలితాన్ని ఇవ్వవు. పరమాత్మ ధ్యానంలో మనసును కేంద్రీకరించి, ఆ నిత్యానందంలో రమిస్తూ ఉండటమే అసలైన ఉపవాసం. కాబట్టి ‘ఆహారం మానేస్తేనే ఉపవాసం’ అనే భ్రమలను వదిలి, ప్రతిదినమూ దేవుడి సన్నిధిలో మనసును నిలుపుతూ జీవిస్తే- అదే మోక్షస్థితికి దారి చూపే దీపమవుతుంది.