News

‘ఒక గ్రామం – ఒక రాయి’ సంకల్పంతో రామ స్థూపం నిర్మాణం

87views

ఉత్తరాంధ్రలో ఆధ్యాత్మిక చైతన్యం, సామాజిక ఐక్యతే లక్ష్యంగా ‘శ్రీరామ గ్రామ జాగృతి యాత్ర’ ప్రారంభమైంది. పార్వతీపురం జిల్లా కేంద్రంలోని శ్రీ విద్యా సర్వమంగళ దేవి పీఠంలో శ్రీరామనవమి వేడుకల అనంతరం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

పీడిక రాజన్న దొర దంపతులు యాత్ర ప్రచార రథాన్ని ప్రారంభించి, లోగోను ముఖ్య అతిథులు యిండుపూరు గున్నేశ్వరరావు, బెలగాం జయప్రకాష్‌ నారాయణ తదితరులతో కలసి కాళిదాసు శర్మ యాజీ నేతృత్వంలో ఆవిష్కరించారు. ఈ ఉద్యమంలో భాగంగా ‘రామ స్థూప నిర్మాణ మహాసంకల్పాన్ని’ చేపట్టినట్టు ఆధ్యాత్మిక మార్గదర్శకులు కాళిదాసు శర్మ యాజి తెలిపారు. ‘ఒక గ్రామం – ఒక రాయి’ నినాదంతో రాష్ట్రంలోని వివిధ గ్రామాల నుంచి భక్తుల భాగస్వామ్యంతో శిలలను సేకరించి రామ స్థూపాన్ని నిర్మించనున్నట్టు వివరించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ధర్మ ప్రచారం, యువతలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం నింపాలని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఆకాంక్షించారు. ఈ యాత్రను తొలుత మన్యం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిర్వహించి, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

పీడిక రాజన్నదొర మాట్లాడుతూ కేవలం సాంప్రదాయాలకు విలువనిస్తూ లోక కల్యానార్ధం రాజకీయాలకు అతీతంగా చేపట్టిన ఈ కార్యక్రమం శ్రీరాముని భక్తుల్లో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపాలని ఆకాంక్షించారు.