News

దేవాలయాల్లో పక్షులకు ఆహారం, ఆశ్రయం

97views

వేసవి కాలంలో ప్రకృతి ప్రేమకు నిదర్శనంగా దేవాలయాల్లో పక్షులకు ఆహారం, నీరు, ఆశ్రయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా అటవీశాఖ అధికారి ఎన్‌.సోమసుందర్‌ అన్నారు. గ్రీన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పట్టణ, మండల పరిధిలో పలు దేవాలయాల్లో పక్షుల కోసం ధాన్యపు కుంచులు, తాగునీరు పాత్రలు, గూళ్లు కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి మనిషి బాధ్యత. ప్రకృతి ఉంటేనే మనిషి జీవనం కొనసాగుతుందన్నారు. గ్రీన్‌ క్లబ్‌ గత 12 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్‌, మే మాసాల్లో ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పక్షుల మనుగడ కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కర్షక దేవోభవ జాతీయ అధ్యక్షుడు ఆడారి కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో గ్రీన్‌ క్లబ్‌ చేస్తున్న కృషి మరవలేనిదన్నారు.

గవరపాలెం గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు కర్రి సన్యాసి నాయుడు మాట్లాడుతూ ప్రజల నిర్లక్ష్యం కారణంగా పర్యావరణం, నీటి వనరులు కలుషితం కాకూడదన్నారు. అంతకుముందు గ్రీన్‌ క్లబ్‌ సభ్యులు గాంధీనగర్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయం, వేల్పులవీధి కాశీ విశ్వేశ్వర ఆలయం, గవరపాలెం భోగలింగేశ్వర స్వామి దేవస్థానం, గౌరీ సేవా సంఘం దేవాలయం, సుంకరమెట్ట జంక్షన్‌లో సూర్యనారాయణ స్వామి దేవస్థానం, సంతోషి మాత దేవస్థానంలో పక్షుల కోసం ధాన్యపు కుంచులు, తాగునీటి పాత్రలు, గూళ్లు ఏర్పాటు చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, గ్రీన్‌ క్లబ్‌ వ్యవస్థాపకులు కొణతాల ఫణి భూషణ్‌ శ్రీధర్‌, భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్‌ సత్యనారాయణ, విశ్రాంత అటవీ శాఖ రేంజర్‌ అధికారి బీర వినోద్‌ కుమార్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.