
ఇస్లామిక్ ఉగ్రవాదం కారణంగా తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలపై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. వారిని ఆదుకోవడంలో ప్రత్యేకంగా, యోజనా బద్ధంగా ముందుకు సాగుతోంది. ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలను కోల్పోయిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. గతంలో కూడా కొందరికి ఇలానే ఇచ్చింది.
తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 50 కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. దీంతో వారి కుటుంబీకులకు గొప్ప ఊరట లభించింది.
ఈ నియామక పత్రాలు అందుకున్న వారిలో ఉగ్రవాద బాధితుల 27 మంది కుటుంబ సభ్యులు, అలాగే జమ్మూ & కాశ్మీర్ పునరావాస సహాయ పథకం-2022 మరియు ఎస్ఆర్ఓ 43 కింద మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల 22 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఉగ్రవాద బాధితులందరి కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని ఎల్జీ హామీ ఇచ్చారు.
ఉగ్రవాద బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేలా, ఏ కుటుంబం కూడా నిర్లక్ష్యానికి గురి కాకుండా, తమ ప్రభుత్వం పూర్తి శ్రద్ధతో ముందుకు సాగుతుందని వివరించారు. ఉద్యోగ నియామక పత్రాలను అందజేయడమే ఆ కుటుంబాలకు నిజమైన న్యాయంగా తాను భావిస్తున్నానని తెలిపారు. ఈ ఉపాధి అవకాశాల ద్వారా ఉగ్రవాద బాధిత కుటుంబాలు తమ కుటుంబాన్ని తిరిగి నిలబెట్టుకొని, హాయిగా జీవించాలని ఆకాంక్షించారు.
అయితే ఇలా ఇస్లామిక్ ఉగ్రవాద బాధిత కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం ఇదే తొలి సారి కాదు. గత యేడాది 14 జూలై మాసంలోనూ 40 మందికి ఎల్జీ మనోజ్ సిన్హా ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
ఇక.. అదే యేడాది ఆగస్టు మాసంలో 15 మంది బాధిత కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
ఆ యేడాదే డిసెంబర్ మాసంలో 41 మంది ఇస్లామిక్ ఉగ్రవాద బాధిత కుటుంబాలకు ఎల్జీ మనోజ్ సిన్హా ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.





