News

పాదయాత్రగా వస్తున్న శ్రీశైలం మల్లన్న భక్తులకు స్వచ్ఛంద సంస్థల సేవలు

138views

ఉగాది వచ్చిందంటే కర్నాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలంకు సుమారు 1200కి.మీ నడిచి వస్తుంటారు. ఎండలను సైతం లెక్కచేయకుండా వందల కిలోమీటర్లు నడిచి మల్లన్నను దర్శించుకుంటారు. కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాదయాత్ర చేసుకుంటూ కర్నూలు జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనార్థం వస్తుంటారు. పెద్ద సంఖ్యలో భక్తులు కర్నూలు మీదుగా శ్రీశైలం వెళ్తుంటారు వీరికి స్వచ్ఛంద సంస్థలు, అన్నదానం, మంచి నీళ్లు, మజ్జిగ అందిస్తుంటారు. ఇండియన్​ రెడ్​ క్రాస్​ సొసైటీ సహా మన ఊరు-మన గుడి – మన బాధ్యత, ఇంటాచ్ నంద్యాల చాప్టర్ సంయుక్తంగా భక్తులకు అవసరమైన మెడిసిన్స్​, మసాజ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కాలి నడకన ప్రయాణం చేపట్టిన యాత్రికులకు మన ఊరు-మన గుడి – మన బాధ్యత, ఇంటాచ్ నంద్యాల చాప్టర్ సంయుక్తంగా ఉచిత వైద్య సేవా కార్యక్రమం చేపట్టింది. ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని జమ్మిచెట్టు వద్ద క్యాంప్ ఏర్పాటు చేశారు. కాళ్లనొప్పులు, ఒళ్లు నొప్పులతో బాధపడే భక్తులకు మర్దన చేయటం, బీపీ, షుగర్ చెక్ చేయటం సహా మందులు ఇవ్వటం, కాళ్లకు బొబ్బలు, గాయాలు అయినవారికి వైద్యం చేయటం, జ్వరం, విరేచనాలు, డీ హైడ్రేషన్ అయిన వారికి మందులు ఇవ్వటం తదితర కార్యక్రమాలు చేస్తున్నారు. వీటికి తోడు పలువురు దాతలు అన్నదానం సహా పండ్లు, మజ్జిగ పంపిణీ చేస్తూ సేవా నిరతిని చాటుతున్నారు.

తైలంతో మర్దన: భక్తుల పాదాలకు తగిలిన గాయాలను శుభ్రం చేసి కట్లు కడుతున్నారు. పాదయాత్రికులు వినియోగించే హోమియో, అల్లోపతి, ఆయుర్వేద మందులను పంపిణీ చేస్తున్నారు. 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు. ఈనెల 16వ తేదీ వరకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని స్వచ్ఛంద సిబ్బంది చెబుతున్నారు. ఉదయం టీ, కాఫీతో మొదలై టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం నుంచి బిస్కెట్, పాలు, కాఫీ వంటివి 24 గంటలు పంపిణీ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా, కర్నాటక, మహారాష్ట్ర నుంచి వచ్చి సేవలందిస్తున్నారు.

అలసిన భక్తులకు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా మండలం మండ్లెమ్‌ గ్రామ సమీపాన శ్రీశ్రీశ్రీనాదానంద తీర్థ ఆధ్వర్యంలో నెలకొన్న ఆశ్రమంలో శిష్యులు సేవలందిస్తూ తరిస్తున్నారు. కాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించేందుకు తైలం మర్దన చేయడం, పాదాలకు తగిలిన దెబ్బలను శుభ్రం చేసి వాటికి మందు వేసి కట్లు కడుతున్నారు. 24 గంటలు ఆశ్రమ శిష్యులు, సేవకులు అందుబాటులో ఉంటున్నారు. గత ఆరేళ్లుగా పాదయాత్ర భక్తులకు సేవలందిస్తున్నారు.