
కర్నూలు నల్లమల అభ్యరణ్యంలో వెలసిన అతి ప్రాచీన ఆలయంగా విశిష్టత కలిగిన సప్త నదుల సంగమేశ్వర క్షేత్రం కృష్ణా జలాల నుంచి బయట పడుతోంది. ప్రతి ఏడాది 8 నెలలు కృష్ణమ్మ ఒడిలో 4 నెలలు భక్తులకు దర్శనమిచ్చే క్షేత్రంగా ప్రసిద్ధి గాంచింది. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా సంగమేశ్వర క్షేత్రం జలాదివాసం వీడుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతం జలాశయం సామర్థ్యం 95.81 టీఎంసీలు, 856 అడుగుల మేర నీటిమట్టం నిల్వ ఉంది. అందులో భాగంగానే శ్రీశైలం జలాశయంలో 832 అడుగులకు నీరు చేరుకుంటే సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా బయటపడి భక్తులకు దర్శనమివ్వనుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో క్రమేపి నీరు తగ్గడంతో నీటిమట్టం 856 అడుగులకు చేరుకుంది.
దీంతో సంగమేశ్వర క్షేత్రం జలాదివాసం వీడి శిఖరం దర్శనమిస్తోంది. ఇక ఈ నెలాఖరుకు ఆలయం పూర్తిగా భక్తులకు దర్శనమివ్వనుంది. ప్రతి ఏడాది మాహా శివరాత్రి నాటికి ఈ ఆలయం భక్తులకు దర్శనమిచ్చేది. కానీ ఈ ఏడాది మాత్రం అధిక వర్షాలు కురవడంతో నీటి తగ్గుదల ఆలస్యమైంది. రెండు వారాల్లో ఆలయం బయట పడనుంది. ఉగాది నాటికి ఈ ఆలయం భక్తులతో పూజలు అందుకోనుంది. ఆలయం బయట పడగానే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి సంగమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.





