News

ఏ ప్రదేశంలోనైనా నమాజ్ చేస్తామంటే కుదరదు : బాంబే హైకోర్టు

145views

మతం కన్నా ప్రజలందరి భద్రత ముఖ్యమని బాంబే హైకోర్టు పేర్కొంది. ముంబయి విమానాశ్రయం సమీపంలో తొలగించిన తాత్కాలిక షెడ్డు ప్రాంతంలో రంజాన్ ప్రార్థనలకు అనుమతించాలని కోరుతూ ట్యాక్సీ, ఆటో రిక్షా డ్రైవర్లు దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇస్లాంలో రంజాన్ అంతర్భాగమేనని తెలిపింది. అయితే, పవిత్ర మాసంలో తాము ఏ ప్రదేశంలోనైనా సరే ప్రార్థనలు చేసుకుంటామని చెప్పటం తగదని జస్టిస్ బి.పి.కొలబవల్లా, జస్టిస్ ఫిర్దోష్ పూనివాలా ధర్మాసనం అభిప్రాయపడింది. ముఖ్యంగా భద్రతాపరమైన చర్యలకు అధిక ప్రాధాన్యమిచ్చే విమానాశ్రయం సమీపంలో అందుకు అనుమతించలేమని స్పష్టం చేసింది. ఎక్కడైనా సరే ప్రార్థనలు చేసుకోవడాన్ని మత హక్కుగా పరిగణించలేమని నొక్కి చెప్పింది. ప్రత్యామ్నాయ స్థలాన్ని చూసుకొని విమానాశ్రయ అధికారులకు వినతి పత్రం సమర్పించుకోవాలని ట్యాక్సీ డ్రైవర్లకు సూచించింది.