
గోదావరి జిల్లాలోని సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులను సమగ్రంగా విశ్లేషించి, వాటి సామాజిక, సాంస్కృతిక ప్రభావాలను అధ్యయనం చేయడమే లక్ష్యంగా చేసిన పరిశోధన ప్రాజెక్టుకు గాను బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయిలో చోటు దక్కింది. ఆ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న అయ్యగారి నాగేశ్వరరావు, శ్రీపాద రామకృష్ణ, ఆకుల ప్రవీణ్‌లు చేసిన ‘గోదావరి జిల్లాల వైదిక వారసత్వంపై విశ్లేషణాత్మక అధ్యయనం’ ప్రాజెక్టుకు గుర్తింపు దక్కింది. ఈ మేరకు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు ఇచ్చిందని బీవీసీ చైర్ పర్సన్ బోనం కనకదుర్గ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాజెక్టుల్లో గోదావరి జిల్లాల వైదిక వారసత్వం మేటిగా నిలిచిందన్నారు. ఈ ప్రాజెక్టుతో తమ కళాశాల విద్యా పరిశోధన రంగాల్లో మైలురాయిని అధిగమించిందని ప్రిన్సిపాల్ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఆ అధ్యాపకులకు అభినందనలు తెలిపారు.





