News

సంస్కృతి, విలువలు, నైతికత సంఘ్ కి ప్రాథమిక పునాదులు : మోహన్ భాగవత్

119views

సమాజం, సంస్కృతి, విలువలు, నైతికత, మంచి ప్రవర్తన సంఘ్ కార్యక్రమానికి ప్రాథమిక పునాదులు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. నైతిక విలువలు, ప్రవర్తన, సంస్కృతి, సమాజం పట్ల నిబద్ధత అన్న వాటిని కృషితో సమన్వయం చేసుకోవడం చాలా అవసరం అని పేర్కొన్నారు. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుందన్నారు.

కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలోని శ్రీమద్ భగవద్గీత ఆడిటోరియంలో సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కుటుంబ వ్యవస్థపై కూడా మాట్లాడుతూ.. ఇళ్లల్లో మంచి మంచి విషయాలపై సంభాషణలు జరగాలని, ఈ సంప్రదాయాన్ని బాగా పెంపొందించుకోవాలని సూచించారు. దీని ద్వారా పిల్లల మనస్సులపై సరైన ప్రభావం పడుతుందని, చెడు ఏదో, మంచి ఏదో తెలిసి వస్తుందన్నారు. కేవలం బోధన ద్వారా మాత్రమే వాతావరణం బాగుపడదని, సంస్కారవంతమైన వాతావరణం ఓ వ్యక్తిని తప్పకుండా కాపాడుతుందన్నారు. ఏ వ్యక్తి అయినా చెడు వైపు వెళ్తుంటే.. అతనికి కుటుంబమే మార్గదర్శనం చేయాలని, జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. కుటుంబం, సమాజంలో విలువలతో కూడిన వాతావరణాన్ని సృష్టించడం అవసరం అని నొక్కి చెప్పారు.

ఇక.. సంఘాన్ని అర్థం చేసుకోవాలంటే సంఘ్ లోకే రావాలని పునరుద్ఘాటించారు. బయటి నుంచి సంఘ్ ను చూడటం, ఊహించడం ద్వారా లేక, ఇతరులు వ్యాప్తి చేస్తున్న కథనాల ద్వారా సంఘ్ ఎన్నడూ అర్థం కాదన్నారు. ఎందుకంటే సంఘ్ లాంటి సంస్థ, కార్య పద్ధతి ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు.
నేడు ఐదు ఖండాల నుంచి ప్రతిష్ఠిత వ్యక్తులు సంఘ్ ని అధ్యయనం చేయడానికి, సంఘ్ నుంచి నేర్చుకోవానికి, అర్థం చేసుకోవడానికి వస్తారని, వారి దేశాల్లో యువతకు ఇలాంటి సంస్థ లేదని, అందుకే ఇలాంటి సైద్ధాంతిక సంస్థను స్థాపించడంలో మద్దతును కూడా అడుగుతారన్నారు.

సూర్యుని లాంటి సూర్యుడు, ఆకాశం లాంటి మరో ఆకాశం వుండదని, అలాగే సంఘ్ లాంటి సంస్థ కూడా మరెక్కడా లేదని అభివర్ణించారు. దూరం నుంచి సంఘ్ ని అర్థం చేసుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే.. అది ఎప్పటికీ సంపూర్ణం కాదని హితవు పలికారు. దేశ వ్యాప్తంగా 1,30,000 సేవా ప్రాజెక్టులను స్వయంసేవకులు నిర్వహిస్తున్నారని అయినా.. సంఘ్ సేవా సంస్థ కాదన్నారు. కళా రంగం, క్రీడలతో పాటు విభిన్న రంగాల వరకూ అన్ని రంగాల్లోనూ స్వయంసేవకులు వున్నారని, చివరికి రాజకీయ రంగంలోనూ వున్నారని కానీ.. సంఘ్ రాజకీయ సంస్థ కాదన్నారు. సంఘ్ ఎవరికో పోటీగా ప్రారంభం కాలేదన్నారు. దేశం పట్ల నిబద్ధతతో, సమాజాన్ని ఏకం చేయడానికి పని చేస్తోందన్నారు.