News

ఆలయ నిర్మాణం కోసం ఓకే తాటిపైకి వచ్చిన మహిళలు

142views

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఆ గ్రామ మహిళలంతా ఒకే తాటిపైకి వచ్చారు. ప్రభుత్వం ‘గృహలక్ష్మి పథకం’ కింద తమ ఖాతాల్లో జమ చేస్తున్న నగదులో కొంత ఊరి దేవత గుడి కోసం విరాళంగా ఇచ్చి తమ భక్తిని చాటుకున్నారు. ఓ వైపు గ్యారెంటీ పథకాల వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతోందని విమర్శలు వస్తున్న తరుణంలో, గృహలక్ష్మి స్కీమ్​ ద్వారా వచ్చిన డబ్బుతో ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు కర్ణాటకకు చెందిన మహిళలు. ఇంతకీ వీరు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం.

విరాళంగా గృహలక్ష్మి స్కీమ్​ డబ్బులు
కర్ణాటక, గదగ్ తాలూకాలోని తిమ్మాపుర గ్రామంలో నాలుగు సంవత్సరాల క్రితం రేణుక ఎల్లమ్మ తల్లి రాతి ఆలయాన్ని నిర్మించాలని అక్కడి గ్రామస్థులు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్థులంతా కలిసి సమష్టిగా ఓ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఆలయ నిర్మాణానికి మొత్తంగా సుమారు కోటి రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేసుకున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి నైపుణ్యం కలిగిన శిల్పులను పిలిపించి నిర్మాణ పనులు అప్పగించారు. అయితే, ప్రారంభ దశలో గ్రామస్థులే దాదాపు 50 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. వీటితో ఆలయ పునాదులు, గోడ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.

అనంతరం, ఆర్థిక ఇబ్బందులు, అదనపు ఖర్చుల కారణంగా ఆలయ నిర్మాణ పనులు కొంతకాలం ఆగిపోయాయి. పనులు పూర్తి కావడానికి ఇంకా రూ.50 లక్షల కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆలయ కమిటీ, గ్రామస్థులు ప్రత్యామ్నాయ నిధుల కోసం అన్వేషించారు. ఈ నేపథ్యంలో గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ద్వారా స్వచ్ఛంద విరాళాలు సేకరించాలని అభిప్రాయపడ్డారు. గృహలక్ష్మి పథకం ద్వారా వచ్చిన డబ్బును స్వచ్ఛందంగా విరాళాల రూపంలో ఇవ్వాలని మహిళలను అభ్యర్థించారు ఆ గ్రామస్థులు. దానికి వారు కూడా ఒప్పుకున్నారు. అనంతరం ఆలయ నిర్మాణం కోసం గ్రామంలోని మహిళలు తమ డబ్బులను విరాళంగా ఇవ్వడం ప్రారంభించారు.

నిధుల అవసరం గురించి వారికి వివరిస్తున్నాం!
తిమ్మాపూర్ గ్రామంలో దాదాపు 850 మంది గృహలక్ష్మి లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో దాదాపు 100 మంది మహిళలు ఇప్పటికే విరాళాలు అందించారు. మొత్తంగా రూ.2.5 లక్షలు సేకరించడం జరిగింది. మిగిలిన లబ్ధిదారుల నుంచి కూడా కనీసం రూ.17 లక్షలు సేకరించాలని గ్రామస్థులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆలయ నిర్మాణానికి కావాల్సిన నిధుల అవసరం గురించి గ్రామస్థులకు వివరిస్తున్నామని చెప్పారు ఆలయ కమిటీ సభ్యులు. ఈ నేపథ్యంలో సాయంత్రం వేళల్లో గ్రామంలోని ఇళ్లను సందర్శిస్తున్నారు.ఇదిలా ఉండగా, రేణుక ఎల్లమ్మ గుడి కోసం తాము డబ్బులు విరాళంగా ఇచ్చామని, ఒకవేళ అది సరిపోకపోతే, మరింత విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని గ్రామస్థురాలు శాంతవ్వ బసాపుర తెలిపారు.