News

బెంగాల్ కేంద్రంగా బంగ్లాదేశ్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ

129views

ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయబాతో సంబంధం వున్న బంగ్లాదేశ్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ బెంగాల్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు బహిర్గతమైంది. బెంగాల్ కేంద్రంగానే వుంటూ కలకత్తాలో ఓ స్థావరాన్ని స్థాపించారని, దీని కేంద్రంగా భారత వ్యతిరేక పోస్టర్ల ప్రచురణ కూడా చేస్తోందని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఈ భారత వ్యతిరక పోస్టర్లను ఢిల్లీ, కలకత్తా లాంటి ప్రధాన నగరాలకు పంపిణీ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. షబ్బీర్ అనే వ్యక్తి బంగ్లాదేశ్ నుంచిPDF ఫైళ్లను పంపించి, కలకత్తాలో వాటి ముద్రణ జరిగిందని కూడా వెల్లడించారు.

ఈ షబ్బీర్ అనే వ్యక్తి సూచనల మేరకే ఈ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ మాడ్యుల్ కలకత్తాలో కార్యకలాపాలను ప్రారంభించిందని భద్రతా అధికారుల దర్యాప్తులో తేలింది. నగర శివారులో 8,000 రూపాయలతో ఓ ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నారు. అలాగే ఈ షబ్బీర్ మాడ్యుల్ కి ఆయుధాలను కొనుగోలు చేయడానికి 80,000 రూపాయలకు పైగానే బదిలీ అయ్యాయని, మరింత అదనపు నిధులు కూడా సమకూర్చుకుంటున్నారని భద్రతా బలగాలు వెల్లడిస్తున్నాయి. మాడ్యూల్ సభ్యులు సిగ్నల్ యాప్ ద్వారా షబ్బీర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని, మాల్డా నివాసి ఉమర్ ఫరూఖ్ అతనితో తరచుగా సంప్రదింపులు జరుపుతున్నాడని తెలుస్తోంది.

ఇక.. ఉగ్రదాడుల ప్రణాళికల తర్వాత బంగ్లాదేశ్ జాతీయులందర్నీ తిరిగి బంగ్లాదేశ్ కి పంపించేందుకు కూడా ఈ మాడ్యుల్ ఓ వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. పాకిస్తాన్ గూఢచారి సంస్థ, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్, బంగ్లాదేశ్‌లో పూర్తి స్థాయి బ్రిగేడ్ తో వుందని నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు అక్కడ స్థావరాలను కూడా విస్తరించినట్లు గుర్తించారు.

బంగ్లాదేశ్‌లో అనేక స్థానిక తీవ్రవాద గ్రూపులు కూడా చురుగ్గా ఉన్నాయి. వీటిలో అల్-ఖైదాతో సంబంధం ఉన్న అన్సార్ బంగ్లా టీం; లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB); రాడికల్ గ్రూపుగా వర్ణించబడిన ఇస్లామీ ఛత్ర శిబిర్; మరియు ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం ఉన్న నియో-JMB ఉన్నాయి.

దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న ఎనిమిది మంది ఇస్లామిక్ ఉగ్రవాద మాడ్యుల్ ను ఈ నెల 15 న ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఏడుగురు బంగ్లాదేశీయులేనని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ నెల 7 న కాశ్మీర్ గేట్ ప్రాంతానికి సమీపంలో వున్న మెట్రో పిల్లర్లపై దేశ వ్యతిరేక పోస్టర్లను అతికించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, దర్యాప్తు ప్రారంభించిన తర్వాత అసలు విషయం బయటపడింది. ఢిల్లీ పోలీసులు, మెట్రో యూనిట్ అనుమానితులను గుర్తించి, వారి కదలికలను ట్రాక్ చేసింది. నిందితులు కలకత్తా నుంచి ఢిల్లీకి ప్రయాణించి, పోస్టర్లను అంటించారని కూడా తేలింది.