
విజయవాడలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో , శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు , శాసనసభ్యులు బొండా ఉమతో కలిసి వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ శౌర్యం, ధైర్యం, పరిపాలనా దక్షత, స్వరాజ్య సాధనలో చూపిన అపార త్యాగస్ఫూర్తి నేటి తరాలకు మార్గదర్శకమన్నారు. గెరిల్లా యుద్ధతంత్రంతో శత్రువులను ఎదుర్కొని, భౌగోళిక పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుని స్వరాజ్యాన్ని స్థాపించిన మహానేతగా శివాజీ మహారాజ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.
రైతుల పంటలను, ప్రజల ప్రాణాలను రక్షిస్తూ యుద్ధం చేసిన నాయకత్వం సమసమాజ నిర్మాణానికి ఆదర్శమని చెప్పారు
ఉగ్రవాద నిర్మూలనలో తీసుకున్న కఠిన నిర్ణయాలు భారత రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయని, సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వంటి చర్యలు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో మన దృఢసంకల్పానికి నిదర్శనం. ఖచ్చితమైన దాడుల ద్వారా ఉగ్రవాదాన్ని లక్ష్యంగా చేసుకోవడం శివాజీ మహారాజ్ ఆత్మస్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని తెలిపారు.
పంజాబ్ నుంచి తంజావూరు వరకు భారత సంస్కృతిని విస్తరించిన శివాజీ మహారాజ్ ఆశయాలు నేటి “ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్” లక్ష్యానికి ప్రేరణగా నిలుస్తున్నాయని, కులమతాలకు అతీతంగా ప్రతిభకు ప్రాధాన్యత ఇచ్చే సమాజ నిర్మాణం అవసరమని, శివాజీ మహారాజ్ నాటిన స్వరాజ్య విత్తనాలు నేడు సురాజ్యంగా వికసిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.





