
రాజ్యసభ వేదికగా రాజ్యసభ సభ్యులు సి. సదానందన్ మాస్టారు వామపక్షాలు చేసిన హింసను మరోసారి దేశం ముందు వుంచారు. తన కృత్రిమ కాళ్లను టేబుల్ పై పెట్టి, ప్రజాస్వామ్య సూత్రాలను వల్లెవేసే వామపక్షాలు చేసిన క్రూరత్వాన్ని దేశ ప్రజల ముందు వుంచారు. బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని ఆయన సభలో ప్రసంగం చేస్తూ.. 31 సంవత్సరాల క్రితం జరిగిన ఘోరమైన దాడిని ప్రస్తావించారు. ఈ ప్రసంగం సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయ్యింది.
’’ఈ రోజు పార్లమెంటులో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వారే, 31 సంవత్సరాల క్రితం నాపై దాడి చేశారు. ఈ పార్టీలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి లేవు, కేవలం రాజకీయ హింసకే కట్టుబడి వున్నాయి.’’ అని మండిపడ్డారు.
‘ప్రజాస్వామ్యం అంటూ ఘర్జనలు చేస్తున్న కొందరు 31 ఏళ్ల క్రితం 1994లో నాపై దాడి చేశారు. ఇంటికి వెళ్తున్నప్పుడు కొందరు క్రిమినల్స్ నా కాళ్లను నరికేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు చేశారు’ అని చెప్పారు. కృత్రిమ కాళ్లను డెస్కుపై పెట్టడంతో తొలి ప్రసంగాన్ని కూర్చొని చేయాల్సి వచ్చిందని అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో ప్రజల ముందు ఉంచడానికే ఇలా చేసినట్టే తెలిపారు.
తాను ఆరెస్సెస్ స్వయంసేవక్ అయినందునే సీపీఎం కార్యకర్తలు తనపై దాడికి దిగారన్నారు. ఈ దాడిలో తన కాళ్లు పోయాయని, వాటిని తిరిగి అతికించడం సాధ్యం కాలేదన్నారు. అందుకే ఈ రోజు కృత్రిమ కాళ్లతో నడవాల్సి వస్తోందని తెలిపారు. రాజకీయ హింస ఏ ప్రజాస్వామ్యానికీ మంచిది కాదు. ఇది దేశ ప్రజాస్వామ్య విలువలకే హాని కలిగిస్తుందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ తప్పుపట్టారు. కృత్రిమ కాళ్లను ప్రదర్శించడం నిబంధనల ఉల్లంఘన అని పేర్కొన్నారు. దీనికి సదానందన్ మాస్టారు గట్టి రిప్లై ఇచ్చారు. ‘‘ప్రజాస్వామ్యం అంటే ఏంటో దేశానికి, ప్రజలకు చూపించాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడూ ప్రజాస్వామ్యం, సహనం, మానవత్వం గురించి మాట్లాడుతారు. కానీ మీ నిబద్ధత రాజకీయ హింసపై ఆధారపడి వుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.’’ అంటూ హితవు పలికారు.
1994 లో తన సోదరి వివాహంపై చర్చించుకొని, తన మామతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా.. సీపీఎం కార్యకర్తలు తమను చుట్టుముట్టి, దాడి చేశారని తెలిపారు. ఆ తర్వాత నేలపై పడేసి, రెండు కాళ్లనూ నరికేసి, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.అయితే.. తన రెండు కాళ్లూ పోగొట్టుకున్నా… జాతీయవాదాన్ని కేరళలో వేగంగా, బలంగా విస్తరించినా, వామపక్షవాదులు పాశవిక దాడికి దిగినా, ఏమాత్రం భయపడకుండా, వెనకడుగు వేయకుండా తన ఉపాధ్యాయ వృత్తిని అత్యంత నిబద్ధతతో సదానందన్ మాస్టార్ నిర్వహించారు.
సదానందన్ మాస్టారు జీవితం ధైర్యత్వానికి, దృఢత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. రెండు దశాబ్దాలకు పైగా కన్నూర్ లో ఉపాధ్యాయునిగా, పెరమంగళంలోని దుర్గా విలాసం హయ్యర్ సెకండరీ స్కూల్ లో సాంఘిక శాస్త్రాన్ని బోధించారు. గౌహతి, కాలికట్ విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలను పొందారు. ప్రస్తుతం కేరళలోని నేషనల్ టీచర్స్ యూనియన్ ఉపాధ్యక్షునిగా వున్నారు. అలాగే దేశీయ అధ్యాపక వార్త అన్న పబ్లికేషన్స్ కూడా నడుపుతున్నారు.





