News

అనుమతులు లేకుండా నమాజ్, అక్రమంగా మదర్సా నిర్వహణ..

251views

ఎలాంటి ముందస్తు సమాచారం గానీ, అనుమతులు గానీ తీసుకోకుండా ఓ ఇంట్లో నమాజ్ చేసిన 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన యూపీలోని బరేలీ జిల్లాలోని మహ్మద్ గంజ్ లో జరిగింది. ఈ తంతు తరుచుగానే జరుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్యకు ఉపక్రమించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే.. ఖాళీగా వున్న ఇల్లు హనీఫ్ అనే వ్యక్తిది అని, కొన్ని రోజులుగా ఖాళీగా వుంచారని, అయితే ఈ 12 మంది ఎలాంటి సమాచారం, అనుమతులు లేకుండానే నమాజ్ కోసం వినియోగించుకుంటున్నారని పేర్కొంటున్నారు. అలాగే దానిని తాత్కాలిక మదర్సాగా కూడా ఉపయోగిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని ప్రకటించారు.

‘‘అనుమతులు లేకుండా కొత్త కొత్త మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం, ఒక ప్రదేశంలో గుమిగూడటం అనేది చట్టపరంగా ఉల్లంఘన కిందికే వస్తుంది. శాంతిభద్రతల సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం వుంది.అందుకే వీరందర్నీ అదుపులోకి తీసుకున్నాం. దీనిపై మాకు ఫిర్యాదులు కూడా అందాయి. స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందుకే తగిన చర్యలకు ఉపక్రమించాం’’ అని పోలీసులు ప్రకటించారు.

మరోవైపు ఖాళీగా వున్న ఇంట్లో వీరు నమాజ్ చేస్తున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. దర్యాప్తులో భాగంగా పోలీసులు దీనిని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారో కూడా నిర్ధరించడానికి ఈ వీడియోను పరిశీలిస్తామన్నారు. మరో వైపు అదుపులోకి తీసుకున్న 12 మందిపై కేసులు నమోదు చేశామని, మేజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచామన్నారు.